Hyderabad | జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ (60) హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య, దోపిడీ చేసిన అనంతరం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పారిపోయినట్లు గుర్తించారు. ఆ సీసీ టీవీ ఫొటోలను పోలీసులు బయటకు విడుదల చేశారు.
నిందితులను పట్టుకునేందుకు కమిషనర్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముంబై, లక్నో, ఢిల్లీలకు ఈ బృందాలను పంపించారు. ఇక నేపాల్ సరిహద్దు ప్రాంతానికి అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. ఇక ఈ హత్య కేసులో నిందితులకు సహకరించిన పనిమనిషి కల్పన గత చరిత్రను పోలీసులు తెలుసుకుంటున్నారు. గతంలో పనిమనిషి కల్పన లక్నోలో పనిచేసిన ఇంటికి వెళ్లి, యజమానులను విచారించారు. కల్పతో పాటు ఉన్న ఇద్దరు యువకులు ఎవరన్నది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని ప్లాట్ నంబర్ 46 లో నివాసం ఉంటు న్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య తనూజ, ఇద్దరు కుమార్తెలతో కలిసి మూడంతస్తుల ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 1న వైద్యం కోసం వినయ్‌రంజన్ రే బెంగళూరు వెళ్లారు. వీరి ఇంట్లో ఏడాది నుంచి కల్పన (30) అనే యువతి పనిమనిషిగా ఉంటున్నది. గతంలో పనిచేసిన కల్పన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె స్థానంలో పనికి కుదిరి అదే ఇంట్లోని సర్వెంట్ రూమ్‌లో ఉంటున్నది. వినయ్‌రంజన్ రే బెంగళూరుకు వెళ్లడంతో పనిమనిషి కల్పనను తన గదిలో పడుకోవాలని తనూజ సూచించారు. పెద్ద కుమార్తె సునందతోపాటు మరో కుమార్తె మూడో అంతస్తులోని బెడ్రూమ్లో నిద్రిస్తుంటారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో మరమ్మతుల కోసం కార్పెంటర్ వచ్చి కుమార్తె సునందకు ఫోన్ చేశాడు. కింది అంతస్తుకు వచ్చిన సునంద.. తల్లి గదిలోకి వెళ్లి చూడగా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు, స్థానికుల సహాయంతో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే తనూజ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
తనూజ హత్య విషయంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ బృందాలతోపాటు ఫోరెన్సిక్ విభాగం సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో కల్పన బయటకు వచ్చి ఇంటికి ఎదురుగా ఉన్న పార్కు వైపు సైగలు చేయడం.. క్షణాల్లోనే ముగ్గురు ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. గంటన్నర తర్వాత రెండు భారీ బ్యాగులతో కల్పనతోపాటు ముగ్గురు ఆగంతకులు వచ్చిన దారిలోనే పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. రెండ్రోజులుగా ఆగంతకులు వినయ్‌రంజన్ ఇంటివద్దకు వచ్చి రెక్కీ నిర్వహించినట్టు, కల్పనతో మాట్లాడి వెళ్లినట్టు తేలింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కల్పనతోపాటు ఇంట్లోకి వెళ్లిన ఆగంతకులు నేరుగా తనూజ బెడ్రూమ్లోకి వెళ్లి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులను బంధించి ఆమె ఒంటిమీద ఆభరణాలతోపాటు అల్మారాలో ఉన్న ఆభరణాలతోపాటు నగదును సూట్‌కేసుల్లో సర్దుకొని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చి పార్కు గుండా పారిపోయినట్టు తేలింది. నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరి ఆడకపోవడంతో తనూజ మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు.