హైదరాబాద్: సినిమాలు పైరసీ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ముఠాను (Movie Piracy Gang) సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ టూల్స్‌తోపాటు ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సనిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకాలు జరుపుతూ కోట్లల్లో ఆర్జిస్టున్నారని పోలీసులు తెలిపారు. దీనిద్వారా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం వాటిళ్లినట్లు అంచనావేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్‌ను అరెస్టు చేశారు. అతడు అందించిన వివరాలతో దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్‌లో పైరసీ ముఠా ఉన్నట్లు గుర్తించారు. థియేటర్లో ప్రదర్శితమయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డులను క్రాక్ చేస్తున్నట్లు తేలింది. అదేవిధంగా ఏజెంట్ల ద్వారా అంగి జేబుల్లో, పాప్‌కార్న్ డబ్బా, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి సినిమాలను రికార్డు చేస్తున్నారు. అలా చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్సైట్లకు విక్రయిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్లు అందిస్తున్నారు.