టీఎస్‌బీపాస్ దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం
ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులకు 5 వేల చొప్పున వేతనం కోత
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : టీఎస్‌బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదుగురు ఉద్యోగుల వేతనాల్లో రూ.5 వేల చొప్పున కోత విధించాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సీడీఎంఏ ఎన్ సత్యనారాయణను బుధవారం ఆదేశించారు. ఇల్లు నిర్మించుకోవాలనుకొనేవారు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతులు పొందడానికి టీఎస్‌బీపాస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 60 గజాలలోపు స్థలంలో ఇంటిని నిర్మించాలనుకొనేవారికి దరఖాస్తు చేసిన పది నిమిషాల్లో అనుమతులు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి. కమర్షియల్ బిల్డింగులకు గరిష్ఠంగా 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లో స్థానిక ఉద్యోగుల నిర్లక్ష్యంతో 58 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిలో మక్తల్‌లో ఏకంగా 42 రోజులైనా దరఖాస్తును పరిశీలించలేదు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది ఉండదని చెప్పటానికి ఈ ఉద్యోగులపై చర్యలు తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ఐదుగురు ఉద్యోగుల ఫిబ్రవరి నెల వేతనాల్లో రూ.5 వేల చొప్పన కట్ చేయాలని అరవింద్ కుమార్ ఆదేశించారు.