Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులపై మెట్రో చార్జీల భారం పడనున్నది. ఈ మేరకు హైదరాబాద్‌లో మెట్రో చార్జీలను పెంచుతూ ఎల్అండ్టీ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 17 నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. కనిష్ఠంగా రూ.2 నుంచి గరిష్ఠంగా రూ.15 వరకు పెరగనున్నాయి. గతంలో కనీస టికెట్ ధర రూ.10 ఉంటే ఇప్పుడు రూ.12, గరిష్ఠంగా రూ.60 ఉన్న టికెట్ రూ.75 కానున్నది. ప్రతి టికెట్‌పై 20 శాతం మేర అదనంగా పెరగనున్నాయి.
మొదటి నుంచి చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో చార్జీల పెంపు ప్రతిపాదనలు తెరమీదకు వచ్చింది. ఎల్అండ్టీ సంస్థ మాత్రం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా ధరలు పెంచుతున్నట్టుగా పేర్కొన్నది. మెట్రో చార్జీల పెంపుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు, మెరుగైన రవాణా సౌకర్యాలను ముందుగా కల్పించాలని, ఆ తర్వాతే ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.