హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ గ్యారేజీలో రూ.12 కోట్ల ఖరీదైన కారు చేరింది. యువ వ్యాపారవేత్త నసీర్‌ఖాన్ మరో అరుదైన మెక్లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కారును కొన్నారు. ‘ఫలక్‌నుమా ప్యాలెస్’లో ఈ కారు డెలివరీని పొందారు. 37 ఏండ్ల నసీర్‌కు విభిన్న రకాల లగ్జరీ కార్లను కొనడం అలవాటు. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెర్సిడెస్ బెంజ్, జీ350డీ, ఫక్షర్డ్ ముస్తాంగ్, లంబోర్ఘిని అవెంటడోర్, లంబోర్ఘిని ఉరస్ వంటి అనేక ఖరీదైన కార్లు ఇప్పటికే అతడి గ్యారేజీలో ఉన్నాయి. ‘వెల్కమ్ హోం మెక్లారెన్ 765 ఎల్టీ స్పైడర్. ఎంతో అద్భుతప్రదేశంలో ఈ అందమైన కారును తీసుకుంటున్నాను’ అని ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద కారుతో దిగిన ఫొటోను నసీర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. మెక్‌లారెన్‌లో జీటీ, 720ఎస్, 720ఎస్ స్పైడర్, 765ఎల్టీ తదితర లగ్జరీ కార్లున్నాయి.
కారు విశేషాలు ఇవి..
దేశంలో 765ఎల్టీ స్పైడర్ మొదటి కస్టమర్ నసీర్. కారు బాడీ వర్క్‌కు కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. కారు బంపర్, స్పిల్టర్, సైడ్ స్కిర్ట్స్, రాప్రౌండ్ రేర్ బంపర్స్ చాలా దృఢంగా ఉంటాయి. కారును కూపే వర్షన్లో రూపొందించారు. కారు రూప్ 11 సెకన్లలోనే ఫోల్డ్ అవుతుంది. రెడ్షేడ్తో స్పోర్టీ లుక్‌లో కారు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది