KTR | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు రేవంత్‌రెడ్డి సర్కారు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట శనివారం హాజరైన కేటీఆర్‌ను సోదరుడిగా భావించి కమిషన్ సభ్యులు దట్టి, రాఖీలు కట్టారు. ఇటీవలే రాఖీ పండుగ జరగడంతో సోదరుడిగా భావించి కేటీఆర్‌కు ఆరుగురు సభ్యులు రేవతిరావు, అఫ్రోజ్ షాహీనా, గజ్జెల పద్మ, ఉమాయాదవ్, సూదమ్ లక్ష్మి, కొమ్రు ఈశ్వరి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు.
మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్‌కు కార్యాలయంలోనే రాఖీ కట్టడంపై కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె ఆదేశం మేరకు కమిషన్ కార్యదర్శి ఆ ఆరుగురు సభ్యులకు నోటీసులు జారీచేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీపౌర్ణమి రోజు రాఖీ కట్టారు. సోదరుడిగా భావించి కేటీఆర్‌కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులపై మాత్రం రేవంత్‌రెడ్డి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగడం గమనార్హం.
మహిళలపై దాడుల సంగతేంటి?
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణాలపై ఇటీవల యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు శనివారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని, మహిళలను, రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించే వ్యక్తిగా మహిళా కమిషన్ ఎదుట హాజరైనట్టు చెప్పారు.
మహిళలపై తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలకు అప్పుడే క్షమాపణ చెప్పినట్టు తెలిపారు. మహిళలపై తనకు అపారమైన గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చినట్టు వివరించారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశానని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. గత 8 నెలల్లో మహిళలపై జరిగిన దారుణాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కొరవడిందని, విద్యార్థుల పట్ల లైంగికదాడుల వంటి అంశాలపై కమిషన్ వద్ద ప్రస్తావించేందుకు అన్ని వివరాలతో వెళ్లినట్టు వివరించారు.
కమిషన్ తనను మరోమారు కలవాలని చెప్పిందని, తప్పకుండా మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. తన వివరణపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని పేర్కొన్నారు. ఒక మాట దొర్లినందుకే మహిళలను గౌరవించే వ్యక్తిగా క్షమాపణలు చెప్పినట్టు వివరించారు. తనతోపాటు బుద్ధభవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులపై మహిళా కాంగెస్ నేతలు నెయిల్ కట్టర్ చాకులతో గాయపరిచారని, ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దాడి కాంగ్రెస్ దుష్ట సంస్కృతికి నిదర్శనం
కేటీఆర్‌తోపాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మిరెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మహిళా నేతలు కూడా మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం, వచ్చాక దాడులు చేయడం శోచనీయమమని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ దుష్ట సంస్కృతికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పట్ల కేటీఆర్‌కు నిబద్ధత ఉన్నది కాబట్టే కమిషన్ ఇచ్చిన సమయం కంటే ముందే హాజరయ్యారని చెప్పారు. బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మహిళా శాసనసభ్యులను అవమానించటంతోపాటు తమ పార్టీ నేతలపై దాడి చేయించారని విమర్శించారు.
ప్రతిదాంట్లో రాజకీయాలు: సబిత
కాంగ్రెస్ పార్టీ ప్రతి దాంట్లోనూ రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూస్తున్నదని మాజీ మంత్రి, చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. చట్టంపై ఉన్న గౌరవంతో మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ హాజరై తన హుందాతనాన్ని చాటుకున్నారని చెప్పారు. దానిని కూడా మహిళా కాంగ్రెస్ నాయకులు అడ్డుకొనే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నాయకులపై దాడులు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై భౌతికదాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్, దళిత మహిళ, బాలికపై లైంగికదాడి ఘటనలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలని సబితారెడ్డి కోరారు.
జిట్టాను పరామర్శించిన కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శనివారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతోనూ కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని వారికి తెలిపారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తదితరులున్నారు.