IT Annual Report | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): కేవలం తొమ్మిదేండ్ల పసి ప్రాయం.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు సహాయ నిరాకరణ.. అయినా ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. ‘కంప్యూటర్ల సృష్టికర్తలం మేమే.. మేము లేకపోతే ఐటీ ప్రగతి ఎక్కడ?’ అన్న వారి ముందే తెలంగాణ ఐటీ రంగం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నది.
ఇతర మెట్రో నగరాలను దాటుకొని.. జాతీయ సగటును సైతం దిగదుడుపుగా మారుస్తూ.. ఐటీ రంగం లో తెలంగాణ విప్లవాత్మకమైన వృద్ధిరేటును నమోదుచేసింది. ఐటీరంగంలో ఎగుమతుల వృద్ధి.. ఉద్యోగాల కల్పన.. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని రాష్ట్ర నలుమూలలకు విస్తరింపజేయడం.. అంతర్జాతీయ స్థాయి కం పెనీల పెట్టుబడుల ఆకర్షణ.. వీటన్నింటి వెనుక తెలంగాణ ప్రభుత్వ శ్రమ, కృషి అమోఘం. సీఎం కేసీఆర్ దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నైపుణ్యం… వెరసి ఐటీ రంగంలో తెలంగాణ మిరుమిట్లు గొలిపే వృద్ధిని నమోదు చేస్తున్నది. 2022-23 తెలంగాణ ఐటీ రంగం ప్రగతి నివేదిక కేవలం అంకెలను కాదు.. ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది.
నిరుడు తెలంగాణకు వచ్చిన కీలక ఐటీ, ఐటీ అనుబంధ పెట్టుబడులు
టైర్-2 నగరాల్లోనూ ఐటీ హవా
వరంగల్‌లో కొలువుదీరిన సంస్థలు: టెక్ మహీంద్రా, సియంట్, జెన్‌ప్యాక్, ఇతర కంపెనీలు హనుమకొండలో: ఎల్టీఐ మైండ్‌ట్రీ, జెన్‌ప్యాక్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్, హెక్సాడ్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్
మహబూబ్‌నగర్: గత నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ ఐటీ హబ్ నాలుగెకరాల్లో విస్తరించి ఉన్నది. నాలుగు అంతస్థుల్లో ఐటీ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ ఇన్నోవేషన్ ఎకోసిస్టంను ఏర్పాటు చేయనున్నారు.
నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు సంబంధించి పలు కంపెనీల సీఈవోలతో ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 2,500 ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు, పదివేల పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ దూకుడు
తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ రంగంలో 2023లో రూ.38 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తద్వారా 31 వేల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అమరరాజా కంపెనీ రూ.9,500 కోట్ల పెట్టుబడితో 4,500 ఉద్యోగాలు, ఫాక్స్‌కాన్ కంపెనీ 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు రానున్నాయి.