హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పచ్చదనం వెల్లివిరిస్తున్నది. నగరంలో గ్రీన్ కవర్ ఏరియా ఏకంగా 147% పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న గ్రీన్ కవర్ ఏరియా ప్రస్తుతం 81.81 చదరపు కిలోమీటర్లకు చేరింది. తలసరి గ్రీన్ కవర్ సైతం 4.3 చదరపు మీటర్ల నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది.
తెలంగాణకు హరితహారంలో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం కాగా ఇందులో 59 పార్కుల నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికే 39 పార్కులు ప్రజలకు అందుబాటులోకి రాగా, మరో 20 పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 50 పార్కుల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు భవిష్యత్తులో ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే అర్బన్ లంగ్ స్పేస్ పార్కులుగా విరాజిల్లనున్నాయి. పచ్చదనాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఆటవీశాఖ, మున్సిపల్ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో 10% నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం కూడా పచ్చదనం పెంపుదలకు మరింత ఊతమిస్తున్నది. దీనికితోడు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సీడీఎంఏ పరిధిలో పెద్ద ఎత్తున మొకలు నాటడంతోపాటు నర్సరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో అవెన్యూ, మల్టిలేయర్, సెంట్రల్ మీడియన్లు, శ్మశానాలు, కాలనీలు, చెరువులు, ఖాళీ స్థలాలు తదితరచోట్ల విరివిగా మొకలు నాటారు. సీడీఎంఏ ద్వారా పట్టణ ప్రకృతివనాలు, బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, మల్టిలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ అభివృద్ధి చేస్తున్నారు. హెచ్ఎండీఏ ద్వారా డ్రిప్, రోటరీలు, ఔటర్ రింగ్‌రోడ్డు, రైల్వే కారిడార్, సర్వీస్ రోడ్ల వెంబడి పచ్చదనం అభివృద్ధికి చర్యలు చేపట్టారు.