హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరుగా పరుగులు తీస్తున్నది. ఈ ఏడాదిలో గత నెల వరకు రోజూ సగటున 189 ఇండ్ల చొప్పున మొత్తం రూ.25,094 కోట్ల విలువైన 50,953 గృహాల అమ్మకాలు జరిగినట్టు ‘నైట్‌ఫ్రాంక్ ఇండియా’ తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నివాస గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో నైట్‌ఫ్రాంక్ ఇండియా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు సర్వే నిర్వహించింది. ఈ నాలుగు జిల్లాల పరిధిలో ప్రతి నెలా 4 వేల నుంచి 7 వరకు ఇండ్ల అమ్మకాలు జరిగినట్టు గుర్తించింది. గత నెలలో ఇక్కడ మొత్తం 4,307 ఇండ్ల అమ్మకాలు జరిగినట్టు తెలిపింది. వాటిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వాటా 43 శాతంగా, రంగారెడ్డి జిల్లా వాటా 41 శాతంగా, హైదరాబాద్ వాటా 15 శాతంగా, సంగారెడ్డి జిల్లా వాటా 1 శాతంగా ఉన్నట్టు వివరించింది.
నివేదికలోని అంశాలు (సెప్టెంబరు నెలకు సంబంధించినవి):
మొత్తం అమ్మకాల్లో రూ.25 లక్షల్లోపు విలువైన ఇండ్ల వాటా 16 శాతంగా, రూ.25 లక్షల నుంచి 50 లక్షల్లోపు విలువైన గృహాల వాటా 55 శాతంగా ఉన్నది. రూ.50 లక్షల నుంచి 75 లక్షల్లోపు విలువైన ఇండ్ల వాటా 13 శాతంగా, 75 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువైన ఇండ్ల వాటా 7 శాతంగా, రూ.కోటి నుంచి 2 కోట్ల విలువైన ఇండ్ల వాటా 6 శాతంగా, రూ.2 కోట్లకుపైగా విలువైన ఇండ్ల వాటా 2 శాతంగా ఉన్నది.
విస్తీర్ణం ప్రకారంగా చూస్తే.. మొత్తం అమ్మకాల్లో 500 చదరపు అడుగుల్లోపు ఇండ్ల వాటా 2 శాతం, 500-1000 చ.అడుగుల్లోపు గృహాలవాటా 17 శాతంగా ఉన్నది.
కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది వెయ్యి -2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇండ్లవైపు మొగ్గు చూపారు.
2-3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇండ్లను దాదాపు 10 శాతం మంది కొనుగోలు చేశారు.