హైదరాబాద్ : బ్యాంకింగ్, ఆర్థిక సేవల పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేంద్రంగా మారిందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాయదుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత కొన్నేండ్ల నుంచి పలు మల్టీనేషనల్ బ్యాంకులను ఆకర్షించిందన్నారు. ఈ ఏడాదికి సంబంధించి అతి పెద్ద కంపెనీల పెట్టుబడుల జాబితాలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కంపెనీ చేరడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాల్లో హైదరాబాద్ నగరం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. గడిచిన కొన్నేళ్లలో ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఈ రంగాల్లో లక్ష 80 వేల మంది కేవలం హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల్లో భాగ్యనగరానికి ఉన్న అనుకూలతలే ఇందుకు ఉదాహరణ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఐఎస్బీ, ఐఐఎం బెంగళూరు సహాకారంతో దేశ వ్యాప్తంగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలన్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ లక్ష్యాన్ని అభినందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని వీ-హబ్‌తో కలిసి పని చేయాలని కోరుతున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికతల్లో రాష్ర్ట ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్థిక రంగంలో మరిన్ని ఆవిష్కరణల రూపకల్పనకు టీ-హబ్ దోహదపడుతుందని ఆశిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కంపెనీలో ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021 చివరి నాటికి 800 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. 2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి గుంజన్ సమతాని తెలిపారు.
A few more glimpses from the inaugural event of the @GoldmanSachs office in Hyderabad. #HappeningHyderabad pic.twitter.com/zPhibnmbwg
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 19, 2021