Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో దొంగలు పడ్డారు. వేర్వేరు చోట్ల యథేచ్ఛగా భారీ దోపిడీలకు పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ అంతర్రాష్ట్ర ముఠాలు స్వైరవిహారం చేశాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పక్క పక్క పోలీస్ జోన్ల పరిధిలోనే ఈ దోపిడీలు జరగడం ఆందోళనకరం. గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వైపు తొంగిచూడాలంటేనే అంతర్రాష్ట్ర ముఠాలకు వణుకు పుట్టేది.. అలాంటిది ప్రస్తుతం మళ్లీ చొరబడిన ఆ ముఠాలు వరుసగా భారీ దోపిడీలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ దొంగలు తుపాకీ కాల్పులతో బెదిరించి భారీ లూటీకి పాల్పడగా, కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో వృద్ధ దంపతులను బంధించి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఇంత జరుగుతున్న పోలీస్ నిఘా వ్యవస్థలు పసిగట్టలేకపోవడం గమనార్హం. ఈ రెండు ముఠాలకు సంబంధం ఉన్నదని, ఒకే ముఠాకు చెందిన వారై ఉండే అవకాశాలూ ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఈ రెండు ఘటనలు జరిగిన తీరు చూస్తే.. వేర్వేరు ముఠాల పనే అని చెప్తున్నారు.
చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాప్‌ను మంగళవారం ఉదయం 10.30 గంటలకు తెరిచారు. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది విధుల్లో చేరకముందే మాస్క్‌లు, టోపీలు ధరించిన ఆరుగురు అగంతకులు ఒక్కసారిగా దుకాణంలోకి చొరబడ్డారు. పిస్టల్‌తో సిబ్బందిని బెదిరించారు. లాకర్ కీ ఇవ్వాలంటూ డిప్యూటీ మేనేజర్‌ను దబాయించారు. ఆయన ఇవ్వకపోవడంతో అతనిపై అదే పిస్టల్‌తో కాల్పులు జరపగా, ఆయన కాలికి గాయమైంది. ఈ సమయంలో దుకాణంలో యథేచ్ఛగా ఆభరణాల కౌంటర్ల అద్దాలను ధ్వంసం చేసి, వాటిల్లో ఉన్న భారీగా బంగారం, వెండి ఆభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకొని పరారయ్యారు. ఇదంతా 10 నిమిషాల్లోనే జరగడం గమనార్హం. దుకాణం సిబ్బంది సమాచారం మేరకు వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో నివాసముంటున్న వృద్ధ దంపతుల ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో వెళ్లారు. ఆ ఇంటి సెంట్రల్ లాక్‌ను తొలగించి, కత్తులతో ముగ్గురు అగంతకులు చొరబడ్డారు. దొంగల అలికిడితో నిద్ర నుంచి మేల్కొన్న రిటైర్డ్ తహసీల్దార్ కొల్ల నాగేశ్వర్రావు, ఆయన భార్య సరస్వతిని బంధించి నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేశారు. దుండగుల దాడిలో సరస్వతి ముఖంపై తీవ్ర గాయమైంది, పండ్లు ఊడిపోయాయి. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. కత్తులతో బెదిరిస్తూ బీరువా తాళాలు తెరిచి ఆ ఇంట్లో ఉన్న సుమారు 30 తులాలకు పైగా బంగారు, 70 తులాల వెండి ఆభరణాలు, రూ.3.5 లక్షల నగదును దోచుకొని పరారయ్యారు. అదే దుండగులు పక్కనే ఉన్న ఎంఐజీ 13లోనూ చోరీకి విఫలయత్నం చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లోని బాలానగర్, మాదాపూర్ జోన్లలో 8 కిలోమీటర్ల దూరంలో 24 గంటల్లో రెండు దోపిడీ ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. పోలీసులు నిద్రావస్థలో ఉండటాన్ని గమనిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలు ఇదే అదనుగా భావిస్తూ నగరంలో పగలు, రాత్రి తేడా లేకుండా దోపిడీలకు పాల్పడుతున్నారు. తుపాకులతో నగరంలో యథేచ్ఛగా తిరుగుతున్నా రక్షణ వ్యవస్థ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.