ఇండో-థాయ్ లోగో పోటీలో శశికి ద్వితీయ స్థానం
హైదరాబాద్, మార్చి 14 : హైదరాబాద్కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ శశి గూడూరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత్-థాయ్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆవిష్కరించనున్న లోగో తయారీ కోసం ఇరు దేశాల గ్రాఫిక్ డిజైనర్లకు నిర్వహించిన పోటీలో శశి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని ఈ నెల 21న అధికారికంగా ప్రకటిస్తారని శశి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఐఐటీ బాంబే నుంచి విజువల్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన శశి.. తెలంగాణ టూరిజం లోగోతోపాటు టీ-శాట్, టీ-యాప్ ఫోలియో, టీ-వ్యాలెట్, హై-ఫై వంటి లోగోలను ఆవిష్కరించారు. టైపోగ్రాఫర్గా కూడా ఆయన తెలుగుటైప్ ఫౌండ్రీని స్థాపించి తెలుగు ఫాంట్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.