– భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
బూర్గంపహాడ్, జూలై 02 : బూర్గంపహాడ్ మండలంలో వానరాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పొద్దన లేస్తే చాలు ఇళ్ల చుట్టూ కోతుల మూక. ఇంటి నుండి ఆరుబయటకు వెళ్లాలన్నాబయటి నుండి ఎవరైనా రావాలన్నా వానర దండు ప్రజలను వదిలి పెట్టడం లేదు. మండలంలోని బూర్గంపహాడ్, సారపాక పంచాయతీలతో పాటు మిగిలిన పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో కోతుల బెడదతో ప్రజలు విసిగిపోతున్నారు. ఇటీవల బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పోస్టుమ్యాన్పై కోతులు దాడిచేసిన సంఘటన జరిగింది. అలాగే ఆ గ్రామంలో పలువురిపై వానరాలు దాడికి దిగడంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు. కోతులను నిర్మూలించాల్సిన పంచాయతీ అధికారులు చూసీ చూడనట్లు ఉండడంతో వాటి ఆగడాలు శృతిమించి పోతున్నాయని ప్రజలు పంచాయతీ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. పంచాయతీ అధికారులు కోతుల నిర్మూలనకు గ్రామ సభల్లో తీర్మానాలు సైతం చేసి వాటిని నిర్మూలించక పోవడం పట్ల ప్రజలు పంచాయతీ పాలకవర్గంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయటికి రావాలంటేనే కోతుల భయంతో వణికిపోతున్నామని, ఇప్పటికైనా పంచాయతీల అధికారులు కోతులను నిర్మూలించాలని కోరుతున్నారు.
బూర్గంపహాడ్, సారపాక పంచాయతీల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభల్లో కోతులను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తీర్మానాలు సైతం చేసి కోతుల ఆగడాలను అరికట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోతుల బారి నుండి ప్రజలను కాపాడాల్సిన అవసరం పంచాయతీ పాలకవర్గాలపై ఉంది.