Pakistan : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవోకేలోని కాశ్మీర్ ఉద్యమకారులకు, పాక్ ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతోంది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్.. పాకిస్తాన్ ప్రభుత్వంపై, అక్కడి ఆర్మీపై సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ప్రభుత్వం తమపై ఆర్మీ ద్వారా ఆయుధాలు ప్రయోగిస్తుందని ఆరోపించారు. అలాగే, అక్కడి ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోందన్నారు. గత నెల 9 నుంచి పీవోకేలో కాశ్మీరీలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
ఈ ఆందోళనల్ని అక్కడి ప్రభుత్వం ఆర్మీతో కలిసి అణిచివేస్తోంది. ఆందోళనకారులపై భారీ ఆయుధాలు ప్రయోగిస్తోంది. ఇదే సమయంలో ఆందోళనకు నేతృత్వం వహించిన అవామీ యాక్షన్ కమిటీని ఉగ్రసంస్థగా ప్రకటించడంతోపాటు, ఈ కమిటీకి చెందిన 150 మందిని ఉగ్రవాదులుగా పాక్ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై సర్దార్ అమన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పాక్ ప్రభుత్వం మమ్మల్ని తీవ్రవాదులు అంటోంది. కానీ, మీడియా ముందు, మానవ హక్కుల సంఘాల ముందు ఒక విషయం చెబుతున్నాం. పాక్ ప్రభుత్వమే ఇక్కడి కొందరి చేతులకు ఆయుధాలిచ్చింది. ఇలా ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ మమ్మల్ని ఉగ్రవాదులు అంటోంది. గత ఏడాది ఫిబ్రవరి 5న జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు రావల్కోట్ పట్టణంలో ఏకే-47లు, కత్తులు, ఇతర ఆయుధాలతో బహిరంగ ర్యాలీ నిర్వహించారు. అది కూడా ఇండియాకు వ్యతిరేకంగా.
ఉగ్రవాద సంస్థలకు, వాటి అనుబంధ సంస్థలకు పాక్ ప్రభుత్వం రక్షణగా ఉంటుందనేందుకు ఈ ఘటన ఒక నిదర్శనం. రావల్కోట్లో జరిగిన ర్యాలీ గురించి అక్కడి డిప్యూటీ కమిషనర్‌ను అడుగుతున్నా.. కత్తులు, ఆయుధాలతో మీరుతీవ్రవాదుల ర్యాలీకి అనుమతించిన విషయం గుర్తుందా? అలాంటి మీరు మమ్మల్ని తీవ్రవాదులు అంటారా..? మేం పాకిస్తాన్‌కు బానిసల్లాగా ఉండదలచుకోలేదు’’ అని సర్దార్ అమన్ ఖాన్ మీడియా ముందు అన్నారు. తాము కోరుతున్న 38 డిమాండ్లను పాక్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే రావల్కోట్ నుంచి ముజఫ్ఫరాబాద్‌కు ర్యాలీ చేస్తామన్నారు. లేదూ అంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌ను వేరు చేసే ఉద్యమంగా మారుతుంది అని ప్రకటించారు.