నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరిన కాంగ్రెస్ మంత్రులు తోక ముడిచి పారిపోయారని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ( BRS leader ) ఆరోపించారు. చర్చలకు వెళుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ), మర్రి జనార్దన్‌రెడ్డి ( Marri Janardhan Reddy ) ని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మంత్రుల దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ దెబ్బకు పారిపోయిన జూపల్లి… జూ లో పిల్లి లాగ మారాడని విమర్శించారు.చర్చలకు రాకుండా పారిపోయిన జూపల్లి పిరికితనం బయటపడిందని విమర్శించారు. హరీష్‌రావును గాని పార్టీ నాయకత్వానికి గాని సవాల్ విసిరేంత స్థాయి లేదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేదని అన్నారు. చేతకాని మంత్రులు సవాల్ ఎందుకు చేయాలి? ఎందుకు తోక ముడవాలని ప్రశ్నించారు. చేతగాని మాటలు మాట్లాడి నాగర్ కర్నూల్ జిల్లా ప్రజల ఇజ్జత్ తీయొద్దని హితవు పలికారు .