పహాడీషరీఫ్, జులై 9: సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న తలంపు తనది. ఆలోచన వచ్చిందే తడువు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సమాలోచనలు జరిపి.. అందరి ఆమోదయోగ్యంతో ముందడుగు వేశాడు పహాడీషరీఫ్‌లోని మహ్మదీయ కాలనీకి చెందిన అబ్దుల్లా హమీద్ ఖాన్. 2008లో మహ్మదీయ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్‌ను రిజిస్ట్రేషన్ చేయిం చి సేవా కార్యక్రమాలకు ముందుకు కదిలాడు. అసోసియేషన్ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు సైతం వారికి వచ్చే ఆదాయంలో నెలనెలా 20 శాతం ఈ సంస్థకు ఇస్తుండటం విశేషం.
ఉచితంగా కుట్టు మిషన్లు..
అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 15 మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం జనవరిలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి చేత సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు అందజేశారు.