Old City Bonalu | హైదరాబాద్ : పాత బస్తీలో జరిగే బోనాలకు వెయ్యి మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయాలను ఆయన శుక్రవారం సందర్శించారు. అనవాయితీగా వస్తున్న ఆయల శిఖర పూజ, ధ్వజారోహన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందని ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకున్నానని, శిఖర పూజలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మెహ్ర ట్రాఫిక్ డీసీపీ ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.