హైదరాబాద్, ఆగస్టు5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న తీరు భేష్ అని మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా ప్రశంసించారు. ఇందుకు, పట్టణ ప్రగతి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతిపై అసెంబ్లీలో శనివారం కొనసాగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ.. డారు. హైదరాబాద్ నగర ప్రగతిని కీర్తించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రోగ్రాం అద్భుత ఫలితాలను ఇస్తున్నదని చెప్పారు. ఇది హైదరాబాదా.. లేక ఫారెన్ కంట్రీనా అనే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. మెట్రోను పాతబస్తీకి విస్తరించాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పాలన దరిద్రాన్ని కడుక్కొంటున్నాం: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు. లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ పాలనలో ఏటా రూ.2 కోట్ల నిధులు కూడా రాని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నేడు సీఎం కేసీఆర్ కోట్లాది నిధులను వెచ్చిస్తున్నారని కొనియాడారు. నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.