హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతి ఏడాది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ 15స్థానానికి పడిపోయింది. ఈ డ్రైవ్‌లో 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న బాలికలందరికీ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఈ వయసున్న బాలికలు 3,47,442 మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించగా, ఈనెల 17 నాటికి కేవలం 91,289 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. మరో 2,56,153 మందికి వ్యాక్సిన్లు వేయాల్సి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 26శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది.
నగరంలో 42,360 మందికి కేవలం 1,177 (3శాతం)మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకొని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో హైదరాబాద్ అట్టడుగున నిలిచింది. మేడ్చల్ మల్కాజిగిరిలో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ 35,409 మందికి కేవలం 2,785 మంది(8శాతం) మాత్రమే డ్రైవ్‌లో పాల్గొన్నారు. తర్వాత స్థానాల్లో నల్లగొండ (12శాతం), నాగర్‌కర్నూల్ (15శాతం), వికారాబాద్ (18శాతం) నిలిచాయి. ఇక 3,701 మంది బాలికలకు 2,745 మందికి వ్యాక్సిన్లు ఇప్పించి పెద్దపల్లి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో రాజన్న సిరిసిల్ల (68శాతం) 4,132 మందికి 2,820 మంది హెచ్‌పీవీ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఖమ్మంలో 10,826 మందికి 7,090 మంది(65శాతం) డ్రైవ్‌లో పాల్గొన్నారు. తర్వాతి స్థానాల్లో సూర్యాపేట(49శాతం), మెదక్(48శాతం)తో టాప్-5లో నిలిచాయి.
దేశవ్యాప్తంగా ఈనెల 5నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియతో పోలిస్తే తెలంగాణ 15 స్థానంలో నిలిచింది. గుజరాత్ (108. 05శాతం), మధ్యప్రదేశ్ (101. 63శాతం), మిజోరం (89.84శాతం), బీహార్ (84.50శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 70.28శాతం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ గణాంకాలను చూస్తే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మన రాష్ట్రంలో వైద్యాధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారో స్పష్టమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా 55,000 నుంచి 66,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య 10శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏటా సగటున 3,200 మంది సర్వైకర్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అత్యంత కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే పూర్తి చేయాలని పలువురు వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.