హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : కృత్రిమ మేధ(ఏఐ), ఆధునిక సాంకేతికతలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ విస్తరిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతిభావంతులైన మానవ వనరులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందున కొత్త సంస్థలు నగరం వైపు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం కృత్రిమ మేధ ఆధారిత సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా డెలివరీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘డాటా ఎకానమీ’ నూతన వర్ స్టేషన్‌ను మంత్రి హైటెక్ సిటీలో ప్రారంభించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్విన్స్, డాటా బదిలీ రంగాల్లో ఈ సంస్థ గణనీయ పురోగతిని సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. తాము నెలకొల్పే ఏఐ సిటీ అభివృద్ధిలో ‘డాటా ఎకానమీ’ భాగస్వామి కావాలని కోరారు. వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో మరో 500 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తామని ‘డాటా ఎకానమీ’ ప్రతినిధులు మంత్రికి వివరించారు.