బన్సీలాల్‌పేట్, జనవరి 8: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ బుధవారం మృతిచెందింది. మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కాశీంపేట గ్రామానికి చెందిన జానమ్మ(65) కిడ్నీ ఇన్ఫెక్షన్, శ్వాస సమస్యతో బాధపడున్నారు.
ఆమెను మంగళవారం అర్ధరాత్రి గాంధీ దవాఖానకు తీసుకువెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చూడాలని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. చివరకు ఈసీజీ, ఎక్స్‌రేలు అంటూ తెల్లవారుజామున 3 గంటల వరకు కనీసం స్లైన్ కూడా పెట్టలేదు.
ఆ తర్వాత ఆక్సిజన్ పెట్టినా ఫలితం దక్కలేదు. అప్పటికే జానమ్మ మృతిచెందిందని వారు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతోనే ఆమె మృతిచెందిందని డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్‌కుమార్ తెలిపారు.