హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) గురువారం ఆత్యహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్‌గా పని చేస్తున్న గోవర్ధన్‌కు కుమారుడు, కూ తురు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే గోవర్ధన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కూతురికి వైద్యం చేయిస్తున్నాడు. జీతం సమయానికి రాక, కూతురుకు వైద్యం చేయించలేక అవస్థలు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా గోవర్ధన్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న నెరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అధికారంలోకి వస్తే హోంగార్డుల ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని నాటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని హోంగార్డులు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే జీతాలే టైమ్‌కు రావడంలేదని, క్రమబద్ధీకరణ ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేవని, పిల్లాపాపలతో ఆనందంగా ఉండేవాళ్లమని చెప్తున్నారు. ఆఖరికి బందోబస్తు విధులకు హాజరైన హోంగార్డుల అలవెన్స్‌లు, డైట్ చార్జీలను కూడా కట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోవర్ధన్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు.