కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 5: సూర్యరశ్మి, గాలితో కలిపి కొత్తగా హైబ్రిడ్ ఇంధనం అందుబాటులోకి రానున్నదా? అందుకు పరిశోధనలు ప్రారంభించారా? అంటే అవును అంటున్నారు జేఎన్టీయూ-హైదరాబాద్ శాస్త్రవేత్తలు. ఇప్పటికే నమూనాను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. వర్సిటీలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ రిసెర్చ్ ఫెలో మేరుగు చంద్రమౌళి.. 1కేవీ శక్తి సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ సోలార్-విండ్ ఎనర్జీ జనరేషన్ సిస్టమ్ నమూనాను అభివృద్ధి చేశారు.
ఆయన చేసిన పరిశోధన చివరి పరిశీలనకు ఎంపికైంది. ప్రాజెక్టు అభివృద్ధికి నిధుల కోసం న్యూఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు వచ్చే నెలలో దీనిపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పరిశోధనకు విభాగం హెచ్వోడీ జయలక్ష్మి, ప్రొఫెసర్ ఏ రఘురామ్ సహకారం అందించారు. ఈ ఇంధన వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఈవీ చార్జింగ్ స్టేషన్కు, ఇతర అవసరాలకు విద్యుత్తు ఇబ్బందులు తప్పుతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.