జమ్మికుంట/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 4: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ కాపాడుతున్నదని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి జమ్మికుంట మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన సీఎంపై ఈటల చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. రాజకీయ ఓనమాలు నేర్పిన గురువును ఇష్టంవచ్చినట్టు అనడం సరికాదని, దిగజారి మాట్లాడొద్దని హితవుపలికారు. కన్నతల్లి లాంటి పార్టీకి, తండ్రి లాంటి కేసీఆర్‌కు ఈటల ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ఓటు ఎలా వేస్తామని ప్రశ్నించారు.
ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌కే ఓటెయ్యాలని విజ్ఞప్తిచేశారు.
అభివృద్ధికి 100 కోట్లు తెస్తా: గెల్లు శ్రీనివాస్
తాను పేదింటి బిడ్డనని.. కండ్ల ముందు తిరిగినోడినని.. ఉద్యమంలో పాల్గొన్నానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసీఆర్ చూపిన బాటలో నడిచానని, పేదోన్నైనా ఆశీర్వదించారని చెప్పారు. ఒక పేదోడికి, పేదోళ్ల బాధ తెలుస్తదని అన్నారని, ప్రజల మధ్య ఉండమన్నారని తెలిపారు. సేవ చేయాలని చెప్పారని, అందుకే ముందుకు వచ్చానని.. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తిచేశారు. ఆరుసార్లు ఈటలను గెలిపించారని, కానీ ఆయన ప్రజలను పట్టించుకోలేదని, అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మంత్రిగా చేయలేని వ్యక్తి, రేపు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆయనకు రూ.5 కోట్ల నిధులుంటాయని, 106 గ్రామాలకు ఏమిస్తారని అడిగారు. అందుకే మరో రెండున్నరేండ్లు ఉండే టీఆర్ఎస్కే ఓటేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి రూ.100 కోట్లు తెచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు.