నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం హాజరయ్యారు. కమలాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 15వేలు, ఇద్దరి పూచీకత్తులను న్యాయవాది లక్ష్మణ్ కోర్టుకు సమర్పించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఎంసీసీ నోడల్ ఆఫీసర్ గుండేబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు 41-ఏ నోటీసులు జారీచేసిన పోలీసులు విచారణ అనంతరం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలాలపై మరోసారి కోర్టు విచారణ చేపట్టనున్నది. నిందితుడిపై నమోదైన ఆరోపణలపై విచారణకు తీసుకునే ప్రశ్నలను ఎగ్జామినేషన్ ప్రక్రియ ద్వారా కోర్టు వివరణ స్వీకరించింది. వచ్చే వాయిదాకు ఫిర్యాదుదారుడితోపాటు సాక్షుల వాంగ్మూలం నమోదు చేసేందుకు వారికి కోర్టు సమన్లు జారీ చేసింది.