హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13 : హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్‌లు టీఆర్ఎస్కు జై కొట్టారు. గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు, రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కృషి చేస్తామని ఏకగ్రీవ తీర్మానం తీశారు. ఆ లేఖను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు శుక్రవారం అందజేశారు. పట్టణంలోని సిటీ కన్వెన్షన్ హాల్లో వంద మంది ముదిరాజ్ కులస్తులు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులు చాలా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. చేపపిల్లల పెంపకంతోపాటు పాటు వలలు, ఆధునిక మరబోట్లు, ఇతర సామగ్రిని అందించి ఆర్థికంగా, సామాజికంగా మత్స్యకారులు ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు కొండాల్‌రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గట్టు పద్దయ్య, సంఘం నాయకులు భిక్షపతి, కొమురయ్య, చిన్న రాజయ్య, రామయ్య, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.