జమ్మికుంట, ఆగస్టు 13: బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. దళితులకు మేలు చేసేందుకు దళిత బంధు పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిప డ్డారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 11, 27వ వార్డులో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి శుక్రవారం పర్యటించారు. స్థానిక కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళిత బంధు పథకం ప్రారంభానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంటే ఈటల రాజేందర్, బండి సంజయ్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. దళిత బంధును ఆపేందుకు ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు ధర్నాలు చేద్దామని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తరతరాలుగా వెనుకబడి, వివక్షకు గురైన దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ దళిత బంధు తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభు త్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని చెప్పారు.