హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ముస్లిం మహిళ ‘ఖులా’ విడాకులు తీసుకునేందుకు చట్టబద్ధత ఉన్నదని, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమేనని హైకోర్టు వెల్లడించింది. ఖులా విడాకులు తీసుకునే ముందు ముస్లిం మహిళ తన భర్త సమ్మతిని పొందాల్సిన అవసరం లేదన్న కింది కోర్టు తీర్పులో జోక్యానికి ఆసారం లేదని స్పష్టం చేసింది. మతపరమైన సలహా మండలి జారీ చేసిన ‘ఖులా’ విడాకుల ధ్రువీకరణపత్రం సరైనదేనని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్లే.. 2012లో వివాహం చేసుకున్న ఓ జంట మధ్య కొంతకాలం తర్వాత గొడవలు తలెత్తాయి. భర్త తనను హింసిస్తున్నాడని చెప్పి భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందింది. కానీ, అందుకు భర్త సమ్మతించలేదు. దీంతో భార్య మతపరమైన సలహా మండలిని ఆశ్రయించింది.
ఇద్దరికి సయోధ్య కుదిర్చేందుకు సలహా మండలి నోటీసులు జారీచేసినప్పటికీ భర్త హాజరుకాకపోవడంతో 2020 అక్టోబర్ 5న ’ఖులానామా’ (విడాకులపత్రం) జారీ చేసింది. ఇది చెల్లదంటూ భర్త వేసిన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. పెండ్లిని రద్దుచేసే అధికారం సలహా మండలికి లేదన్న భర్త వాదనను తోసిపుచ్చింది. కోర్టు జోక్యం లేకుండా ఖులా ద్వారా విడాకులు తీసుకోవచ్చన్న భార్య వాదనను ఆమోదించింది.