Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్లాల్ (27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన మూడో రోజు నుంచే నీకు మగతనం లేదంటూ భార్య అవమానించడం, మానసికంగా వేధించడం మొదలుపెట్టింది.
ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తారింటికి వెళ్తే.. అక్కడ తన కుటుంబసభ్యులతో కలిసి మరోసారి సదర్‌లాల్‌ను భార్య అవమానించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటికొచ్చి బాధపడ్డాడు. తర్వాత అక్క దగ్గరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి.. బయటకు వెళ్లి చనిపోతున్నానని బావకు ఫోన్ చేసి చెప్పాడు. అలాగే అతని లొకేషన్‌ను షేర్ చేశాడు. కంగారుపడిన కుటుంబసభ్యులు వెంటనే వి.వెంకటాయపాలెం కాల్వ దగ్గరకు వెళ్లి చూడగా.. అక్కడ సదర్లాల్ బైక్, ఫోన్, కలుపుమందు డబ్బా కనిపించాయి. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కాల్వలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు.
అయితే పెళ్లికి ముందే సదరు యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని.. పెళ్లయ్యాక కూడా అతనితో సంబంధం కొనసాగించేందుకే సదర్‌లాల్‌కు మగతనం లేదని ఆరోపణలు చేసిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. యువతి ఆరోపణలతో పంచాయతీ పెడితే.. మెడికల్ టెస్ట్‌లు చేయించామని వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.