సుల్తానాబాద్, ఫిబ్రవరి 16 : అవిశ్వాసం నెగ్గడంతో తన భార్య మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కోల్పోయిందన్న మనస్తాపంతో ఆమె భర్త గుండె ఆగిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకున్నది. ముత్యం సునీత సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కాగా ఇటీవల ఆమెపై కొందరు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం నెగ్గడంతో సునీత తన పదవిని కోల్పోయారు.
ఈ ఘటనతో ఆమె భర్త బీఆర్ఎస్ నాయకుడు ముత్యం రమేశ్‌గౌడ్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే సుల్తానాబాద్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు. రమేశ్‌గౌడ్‌కు భార్య సునీతతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్‌తోపాటు కౌన్సిలర్లు తదితరులు రమేశ్‌గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.