హైదరాబాద్ సిటీబ్యూరో/పీర్జాదిగూడ, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ప్రేమించి, పెండ్లి చేసుకున్న వాడే కాలయముడయ్యాడు. పెళ్లయిన కొంతకాలానికే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. తొలినుంచి వేధింపులతోనే భార్యను సాధించసాగాడు. చివరకు గర్భవతి అయిన భార్యను అతి కిరాతకంగా హతమా ర్చి, ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యా ఘటనను ఇది పోలి ఉండటం గమనార్హం. శ్రద్ధావాకర్‌ను ఆమె తోడుగా ఉండే అప్తాబ్ గొంతునులిమి చంపాడు. పాశవికంగా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, 3వారాలపాటు ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను విసిరేశాడు. ఈ ఘటనతోపాటు మీర్పేట్లో భా ర్యను చంపి, ముక్కలు చేసి శరీర భాగాలను ఉడకబెట్టిన కిరాతక భర్త ఘటననూ మరువక ముందే ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది.
కేసు వివరాలను ఆదివారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన సామల మహేందర్‌రెడ్డి(28), అదే గ్రామానికి చెందిన స్వాతి(21)తో 2024 జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దంపతులిద్దరూ హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చి బోడుప్పల్లో నివాసముంటున్నారు. కులాంతర వివాహం కారణంగా ఇరు కుటుంబల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దీంతో దంపతులిద్దరూ తరుచూ గొడవలు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెండ్లయిన నాలుగు నెలలకే వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో స్వాతి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో పెద్దలు పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చారు. స్వాతి మొదటిసారి గర్భవతి కావడంతో మహేందర్‌రెడ్డి ఆమెకు అబార్షన్ చేయించాడు. మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా స్వాతి పంజాగుట్టలోని ఒక కాల్సెంటర్లో 3నెలలపాటు ఉద్యోగం చేసింది. ఆమె ఫోన్ వాడకం, ఉద్యోగానికి వెళ్తుండటంపై అనుమానం పెంచుకున్న మహేందర్‌రెడ్డి ఆమెను ఉద్యోగం మాన్పించేశాడు. ఈ ఏడాది మార్చిలో స్వాతి రెండోసారి గర్భవతి అయ్యింది. గొడవల కారణంగా కొన్నాళ్లకే తమ స్వగ్రామం వెళ్లిపోయిన దంపతులు నెల క్రితమే బోడుప్పల్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు.
గొంతునులిమి దారుణహత్య
5నెలల గర్భవతి అయిన స్వాతి ఈనెల 27న వికారాబాద్ వెళ్లి, దవాఖానలో చూపించుకున్నాక, తన పుట్టింటికి వెళ్తానంటూ ఈ నెల 22న భర్త మహేందర్‌రెడ్డికి చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాతే స్వాతిని హతమార్చాలని మహేందర్‌రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. మరుసటి రోజైన శనివారం బోడుప్పల్లో హెక్సా బ్లేడ్లు కొని ఇంటికి తీసుకెళ్లాడు. అదేరోజు భార్యను ఎలాగైనా హతమార్చాలని అవకాశం కోసం చూశాడు. సాయంత్రం సమయంలో మళ్లీ భా ర్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో భార్య గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్‌పై ఉంచి హెక్సా బ్లేడుతో తల, చేతులు, కాళ్ల భాగాలను వేరు చేశాడు. చీకటి పడ్డాక తల, చేతులు, కాళ్ల భాగాలను ఓ సంచిలో తీసుకెళ్లి ప్రతాపసింగారం వద్ద మూసీలో పడేసి వచ్చాడు. మొండెం మాత్రం ఇంటిలోనే ఉంచాడు. ఐదు నెలల గర్భవతి కావడంతో మొండెం కవర్లో తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించి వదిలేశాడు.
భార్య కనిపించడం లేదని..
భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు మహేందర్‌రెడ్డి.. తన సోదరికి ఫోన్ చేసి స్వాతి కన్పించడం లేదంటూ చెప్పాడు. ఈలోగా శనివారం రాత్రి మహేందర్‌రెడ్డి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తన భార్య కనిపించడం లేదని చెప్పాడు. బోడుప్పల్ తమ పరిధికి రాదని మే డిపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించగా, అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
పోలీసుల అనుమానమే నిజమైంది!
మహేందర్‌రెడ్డి చెప్పే విషయంలో మేడిపల్లి పోలీసులకు అనుమానం కలిగింది. స్వాతి మిస్సింగ్ కేసు నమోదుచేసి, వారింటికి వెళ్లి త నిఖీలు చేయగా, పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించేలా స్వాతి మొండెం కనిపించింది. మిగతా భాగాల గురించి పోలీసులు నిలదీయడంతో మూసీలో పడేశానని చెప్పాడు. ఆదివారం ఉదయం నుంచి మూసీలో పోలీసులు శరీర భాగాల కోసం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వెతికారు. మూసీ వరద ఉధృతి కారణంగా శరీరభాగాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు లంభించిన మొండేన్ని పో స్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపి, నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దరాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడయ్యిందా?
కులాంతర వివాహం చేసుకున్న స్వాతి, మహేందర్‌రెడ్డి దంపతుల నడుమ వివాదం రగిలేలా మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులే ప్రోత్సహించారా? దీనికి స్వాతి తరచూ ఫోన్ చూస్తుందన్న అనుమానం కూడా పెనుభూతంగా మారి తోడయిందా? అని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. స్వాతి మొదటిసారి గర్భవతి అయ్యాక.. ఆమె ఏమి ఆస్తి తెచ్చింది, పుట్టబోయే బిడ్డకు ఆస్తి రాసియ్యాలా? అంటూ ఎత్తిపొడుపు మాటలతో స్వాతి, మహేందర్‌రెడ్డి మధ్య వివాదాలు ముదిరేలా మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు చేశారని, ఆ తర్వాతే బలవంతంగా అబార్షన్ చేయించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. స్వాతి రెండోసారి గర్భవతి అయ్యాక కూడా దవాఖానకు తీసికెళ్లకుండా ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మహేందర్‌రెడ్డి తరఫు బంధువులు, కుటుంబ సభ్యుల వ్యవహారంతోనే స్వాతిని వదిలించుకోవాలని మహేందర్‌రెడ్డి పథకం వేశాడని, అందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం హత్యచేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.