బోనకల్లు, సెప్టెంబర్ 11: జీవిత చరమాంకంలోనూ ఓ వృద్ధ దంపతులు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. మరణంలోనూ వారి బంధం వీడలేదు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఈ విషాదకర ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బోనకల్లు మండల కేంద్రానికి చెందిన నందమూరి సుందరమ్మ(84) అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. కుటుంబసభ్యులు ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకురాగా, సహధర్మచారిణి మరణించిందన్న విషయం తెలుసుకున్న ఆమె భర్త నందమూరి హనుమయ్య(90) ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. కాసేపటికే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొన్నది.
నాటుసారాపై ‘ఎక్సైజ్’ దాడులు
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా, డ్రగ్స్, గంజాయిపై దాడులు కొనసాగిస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఖమ్మం జిల్లాలో 52 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేశారని, ఎన్టీఆర్ సరిల్లో కేజీ గంజాయిని డీటీఎఫ్ టీం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా గూడూరు సలార్తండాలో 43 లీటర్ల లికర్, 500 కేజీల బెల్లం, 19 కేజీల పటిక, భూపాలపల్లి జిల్లాలో 10 కేజీల బెల్లం, 400 లీటర్ల పానకం, 22 లీటర్ల సారా స్వాధీనం, ఐదుగురు అరెస్ట్, కరీంనగర్ జిల్లాలో 22 లీటర్ల సారా, 300 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.