Khammam | భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. బావిలో దూకి సచ్చిపోతానని ఇంట్లో నుంచి వెళ్లిన భార్య నిజంగానే దూకేసిందేమోనని.. ముందు వెనుక ఆలోచించకుండా ఓ భర్త బావిలో దూకేశాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మరణించాడు. అతన్ని కాపాడేందుకు బావిలో దూకిన ఓ స్నేహితుడు కూడా నీటిలో గల్లంతై చనిపోయాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన నాగరాజు, రమణమ్మ దంపతులు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఆ గొడవతో మనస్తాపానికి గురైన రమణమ్మ .. ‘ఇక బతకను.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా’ అని ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటికే కోపం మీద ఉన్న నాగరాజు భార్యను ఆపలేదు. కాసేపటికే తేరుకున్న నాగరాజు భార్య కోసం చుట్టుపక్కల వెతికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో అన్నట్టుగా బావిలో దూకిందేమోనని కంగారుపడిపోయాడు. తమ ఇంటికి సమీపంలో వ్యవసాయ బావి ఉండటంతో అందులోనే దూకి ఉంటుందనే అనుమానంతో అక్కడికి వెళ్లాడు. వెళ్లేప్పుడు తన స్నేహితుడు యండ్రాతి జోజిని తీసుకెళ్లాడు.
బావి దగ్గరకు వెళ్లగానే తన భార్యను ఎలాగైనా రక్షించుకోవాలనే తొందరలో తనకు ఈత రాకపోయినా నాగరాజు బావిలో దూకేశాడు. నాగరాజుకు ఈత రాదనే విషయం తెలిసిన జోజి కూడా స్నేహితుడిని కాపాడేందుకు బావిలో దూకాడు. ఈ క్రమంలో నాగరాజు, జోజి ఇద్దరూ నీట మునిగి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాగరాజు, జోజి మృతదేహాలను బయటకు తీశారు. పంచానామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రమణమ్మ ఏమైందని స్థానికులు వెతగ్గా.. సమీప చేనులో ఏడుస్తూ కనిపించింది. ఆమెకు స్థానికులు జరిగిన విషయం చెప్పగా గుండెలవిసెలా రోదించింది. ఏదో బెదిరిద్దామని బావిలో దూకుతానని చెబితే.. అదే తన భర్త మరణానికి కారణమైందని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.