అమ్రాబాద్: తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతరకు (Saleshwaram Jatara) జనం పోటెత్తారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రధాని రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్‌పోస్ట్ నుంచి సిద్ధాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్దసంఖ్యలో సలేశ్వరం, శ్రీశైలానికి వెళుతున్నారు. మన్ననూరు చెక్‌పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాదారుల నుంచి అటవీశాఖ టోల్ వసూలు చేస్తున్నది. టోల్ రుసుముల చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతున్నది. దీంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది కృషిచేస్తున్నారు.
ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు సలేశ్వరం జాతర నిర్వహిస్తుంటారు. ఈ నేల 11న ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగినుంచిది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు.