NH 44 | కామారెడ్డి జిల్లాల్లో కూరిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి 44 (NH 44) దెబ్బతిన్నది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివ నగర్ నుంచి పొందుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గం బ్లాక్ అయింది. క్యాసంపల్లి వద్ద హైవే కుంగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేపై వరద ప్రవాహం పెరగడంతో పోలీసులు వాహనాలను నియంత్రించారు. వెనక్కి వెళ్లలేక, ముందుకు కదల్లేక వాహనాదారులు గంటల కొద్ది నరకప్రాయాన్ని అనుభవించారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గేటు వద్ద నేషనల్ హైవే 44పై భారీ వరదతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బీబీపేట-కామారెడ్డి మార్గంలో బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. పోచారం ప్రాజెక్టు ఉగ్రరూపంతో హైదరాబాద్-బోధన్ మార్గంలో హైలెవెల్ వంతెన ధ్వంసమైంది.
మరోవైపు పోచారం ఉద్ధృతికి మెదక్ జిల్లాలో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో కామారెడ్డి- మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోచారం ప్రాజెక్టు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.