హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇవాళ తెలంగాణలో పచ్చదనపు స్పృహ ప్రతిధ్వనిస్తున్నది. నీలాకాశం తన పుడమి సోదరి ఆకుపచ్చని కోక చుట్టుకొంటున్న సందర్భాన్ని చూసి ఆనందంతో వర్షిస్తున్నది. రాష్ట్రమంతా ప్రకృతిని పరవశింపజేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించిన హరిత నిధిలో తామూ చేయీ చేయీ కలుపుతామని సామాన్యుడినుంచి సంపన్నుడి వరకు ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వేనోళ్లా కొనియాడుతున్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యపడుతుందని ప్రశంసిస్తున్నారు. రాబోయే తరాలకు అత్యుత్తమ, ఆరోగ్యకరమైన ప్రాకృతిక వాతావరణాన్ని అందించాలన్న మహత్తర లక్ష్యంతో ప్రారంభించిన ఈ నిధికి విరాళాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇందుకు శుభారంభం చేశారు. తన ఇంట్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న 20 టన్నుల ఎర్రచందనం దుంగలను ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించారు. తాను ఎంతో మమకారంతో పెంచుతున్న శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను కూడా స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ హరిత నిధికి నిండు మనసుతో మద్దతు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సైతం నిధిని సమకూర్చేందుకు ఉత్సాహం చూపిస్తుండటం దీనికి లభిస్తున్న ఆసక్తిని వెల్లడిస్తున్నది. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణకు చెందిన ఎన్నారైలు సైతం విరాళాలు ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. సమాజంలోని వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న స్పందనలు చూస్తుంటే నభూతో.. న భవిష్యత్ అన్నరీతిన ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తున్నది.
కరెన్సీపై హరితహారం ముద్రించాలి
సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుచేయడం సంతోషదాయకం. హరితనిధికి నా దగ్గర ఉన్న 20 టన్నులు ఎర్రచందనం దుంగలను విరాళంగా ఇస్తా. నా నివాసంలోనే ఈ దుంగలున్నాయి. ఈ ఏడాది రహదారుల వెంట ప్రభుత్వ భూముల్లో నాటిన వెయ్యి శ్రీగంధం మొక్కలు, వాటి నుంచి వచ్చే విత్తనాలన్నీ హరితనిధికి తీసుకోవాలి. మా ఊళ్లో చెరువుకట్ట గుట్టల్లో బడ్జెట్ వనం పేరుతో ‘ఎర్రచందనం’ మొక్కలు పెంచుతున్నా. రెండు లక్షల మొక్కలు జీవం పోసుకొన్నాయి. వాటినీ హరితనిధికి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నా. హరితహారంతో కొన్ని కోట్ల మొక్కలు తెలంగాణ గడ్డపై జీవం పోసుకునేలా చేసిన సీఎంకు చేతులెత్తి మొక్కుతున్నా. తెలంగాణ చేపడుతున్న హరిత ఉద్యమాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్రాన్ని డిమాండ్‌చేస్తున్నా.
ఇది మా అదృష్టం
హరితనిధిని ఏర్పాటుచేసి, హరిత యజ్ఞంలో ఉద్యోగులను భాగస్వాములను చేయడం మాకు లభించిన బృహత్తర అవకాశంగా భావిస్తున్నాం. హరితనిధి ఏర్పాటుతో హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు.
స్ఫూర్తిమంతమైన నిర్ణయం
హరితనిధి ఏర్పాటు తెలంగాణను హరితమయం చేస్తుంది. స్ఫూర్తిమంతమైన ఈ నిర్ణయం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం లభించడం మాకు గర్వకారణం. ఉపాధ్యాయులంతా నిధి సమర్పణకు సిద్ధంగా ఉన్నారు.
ఆహ్వానించదగ్గ పరిణామం
మొక్కలు నాటే ఉద్యమాన్ని కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటుచేసి, అందరినీ భాగస్వామ్యం చేయడం ఆహ్వానించదగిన పరిణామం. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం తరపున మేము సైతం సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం.
– మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు
పచ్చదనాన్ని పునరుజ్జీవింపజేస్తుంది
హరితనిధి తెలంగాణలో పచ్చదనాన్ని పునరుజ్జీవింపజేస్తుందన్న విశ్వాసం నాకున్నది. ఈ నిధికి నెలకు రూ.25 ఇచ్చేందుకు స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నాం.
– ఎం మహిపాల్‌రెడ్డి, తెలంగాణ టీచర్స్ యూనియన్
మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ముదావహం
ఇలాంటి చక్కటి కార్యక్రమంలో ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం ముదావహం. హరితనిధిలో ఉద్యోగులుగా ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని నిధికి సమకూరుస్తాం.
చిన్న మొత్తంతో గొప్ప ఫలితం
హరితనిధికోసం ఇచ్చే చిన్నమొత్తం భవిష్యత్తు తరాలకు గొప్పగా ఉపయోగపడుతుంది. ఐపీఎస్ అధికారులుగా మేమిచ్చేది చాలా చిన్న మొత్తమే అయినా, పచ్చదనాన్ని పెంచే గొప్పపనిలో మా భాగస్వామ్యం ఉన్నదన్న తృప్తినిస్తుంది. పోలీస్‌శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంతోషంగా దీనిలో పాల్గొనాలనుకొంటున్నారు.
– ఎం మహేందర్‌రెడ్డి, డీజీపీ
ఎన్నారైల తరపున కృతజ్ఞతలు
గొప్ప నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైల తరఫున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరినీ ప్రకృతి రక్షణలో పాలు పంచుకునేలా చేయడం అద్భుతం. ప్రతి ఎన్నారై ముందుకొచ్చి హరితనిధికి తోడ్పాటునందించాలి.
– మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్
ఆరోగ్య తెలంగాణకు హరితనిధి
ఇది ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తుంది. ప్రకృతి పచ్చగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటాం. భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మంచి వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత.
– జీ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
చరిత్రాత్మకం
సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం. పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. అటవీశాఖకు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని గుర్తింపును సీఎం కేసీఆర్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఫలితాలొచ్చాయని అసెంబ్లీలో సీఎం ప్రకటించడం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
– ఆర్. శోభ, పీసీసీఎఫ్
హరితనిధికి నెలకు వంద
హరితనిధికి నా వంతుగా నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తా. నెలకు రూ.ఐదు వేలు చెల్లిస్తానని ఎంపీ సంతోష్‌కుమార్ చేసిన ప్రకటన స్ఫూర్తితో ఈ నిర్ణయం
తీసుకొన్నా.
– కిశోర్‌గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు
కేసీఆర్ పిలుపు మేరకు మేము సైతం..
హరితనిధిలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ అసొసియేషన్ సైతం పాలు పంచుకుంటుంది. మేము సైతం నెలకు రూ.25 అందజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కాలేజీలు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం. – గౌరి సతీశ్, టీపీజేఎంఏ