హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పౌర సమాజం తలెత్తుకునేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని గ్రా మోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ వసంత్ పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షుడు బీ శ్యామ్, సమతా సైనిక్ దళ్ జాతీయ ఉపాధ్యక్షుడు దాసరి శ్యామ్ మనోహర్, తెలంగాణ రిసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ చైర్మన్ మాందాల భాస్కర్, ఉద్యోగుల సంఘం నేత మామిడి నారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బీఆర్అంబేద్కర్ పేరు పెట్టడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 4న రవీంద్రభారతిలో స్వాగతసభను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపనున్నట్టు పేర్కొన్నారు. సభకు యూ జీసీ పూర్వపు చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ హాజరవుతారని, సభను విజయవం తం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఒక్క విజ్ఞప్తి చేయగానే సీఎం కేసీఆర్ నామకరణం చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం తీసుకోని నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. కాగా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం తదితర సంఘాలతో ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్లుగా బీ శ్యామ్, దాసరి శ్యామ్ మనోహర్, ప్రొఫెసర్ రమణానాయక్ వ్యవహరిస్తారు.