NTR | హైదరాబాద్ మింట్లో తయారైన ఎన్టీఆర్ స్మార నాణేలకు విశేష స్పందన లభిస్తుంది. రెండున్నర నెలల్లో 25వేల నాణేలు అమ్ముడుపోవడం దేశంలోనే సరికొత్త రికార్డని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ సెంటనరీ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వీఎన్ఆర్ నాయుడు, శ్రీనివాస్ గండపనేడు, తానాజీ పాల్గొన్నారు.
దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైందన్నారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మహాత్మా గాంధీ వంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేసిందని.. అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలో 12వేల నాణేలు రికార్డని.. ఆ రికార్డును ఎన్టీఆర్ స్మారక నాణెం బ్రేక్ చేసిందన్నారు. ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని, 29వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
కమిటీ చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ అన్ని ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందన్నారు. అన్నగారి శతాబ్ది సంవత్సరంలో కమిటీ, ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు, చారిత్రాక ప్రసంగాలు, శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చేయగా.. అందులో ఎన్టీఆర్ స్మారక నాణెం మొదటి వరుసలో ఉండడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంఠంనేని రవి శంకర్, భగీరథ, విక్రమ్ పూల, దొప్పలపూడి రాంమోహన్, మండవ సతీశ్ పాల్గొన్నారు.