వానాకాలం ప్రయాణాల్లో రోజువారీ మేకప్‌తో చర్మాన్ని కాపాడుకోలేరు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు వెంటవెంటనే మారుతుంటాయి. చల్లగా ఉందని మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటే కాసేపటికే వేడి వాతావరణంలో ఇబ్బంది కలగొచ్చు. సాధారణంగా సాయంకాలాల్లో గాలిదుమారం సమస్య ఉంటుంది. తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ప్రయాణిస్తే ముఖం జిడ్డు కారడమే కాదు, చర్మంపై దుమ్ము పేరుకుంటుంది. అందువల్ల స్వేద రంధ్రాలు పూడుకుపోతాయి. ఇన్ఫెక్షన్ వల్ల మొటిమలు వస్తాయి. కొందరి ముఖం నల్లబారి అందవిహీనంగా తయారవుతుంది. ఎక్కువ వేడి, తేమ వల్ల కలిగే ఈ అసౌకర్యం నుంచి ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుగుతూ చర్మం ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు.
కాబట్టి వానాకాలం ప్రయాణాల్లో ఫోమింగ్ జెల్ క్లెన్సర్స్ వెంట తీసుకుపోవాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్లయితే నాన్ ఫోమింగ్ క్లెన్సర్స్ వాడాలి. కేవలం స్నానం చేసేప్పుడే సబ్బుతో కడిగితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోలేరు. బయటికి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి, హోటల్ రూమ్‌కి చేరుకునేంత వరకు ముఖం కడగకుండా ఉంటే అందమే కాదు చర్మ సమస్యలూ వస్తాయి. కాబట్టి కనీసం రెండుసార్లు క్లెన్సర్స్తో ముఖం కడగాలి. ఆక్నే ప్రోన్ స్కిన్ (అధిక జిడ్డు వల్ల స్వేదరంధ్రాలు మూసుకపోయే చర్మం) అయితే వీపు, భుజాలపై మొటిమల్లాగా కురుపులు వస్తాయి. ఇలాంటి స్వభావం కలిగిన చర్మానికి యాంటి బ్యాక్టీరియల్ క్లెన్సర్ జెల్ ఉపయోగించాలి.