పిల్లలు చేసే ప్రతిపనిలోనూ కలగజేసుకొని వారి తప్పులను సరిదిద్దడం మాత్రమే పేరెంటింగ్ అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. పిల్లలను కాన్ఫిడెన్స్‌గా ఉంచడం అంటే నలుగురిలో బిగ్గరగా, ధైర్యంగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ ‘నేను ఇది చేయగలను’ అనే నమ్మకాన్ని పిల్లల్లో కలిగించడమే నిజమైన ఆత్మైస్థెర్యం అంటున్నారు సైకాలజిస్ట్‌లు.
వారు చేసే ప్రతిపనిలోని తప్పులకు, ప్రతిఫలాలకు బదులు వారి కష్టాన్ని, ప్రయత్నాన్ని అభినందించాలి. మాట్లాడటానికి బిడియపడినా, తడబడినా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలి. వారిని జడ్జ్ చేయకుండా అండగా నిలవాలి. ఆత్మైస్థెర్యం అనేది పిల్లలకు పుట్టుకతో వచ్చేది కాదు. అది వారి తప్పొప్పులను ప్రేమతో వేలసార్లు సరిదిద్దే పెద్దలనుంచి అలవడుతుంది అని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
పిల్లలు ఏదైనా పని తలపెడితే ముందే సరిదిద్దడమో, జాగ్రత్తలు చెప్పడమో చేయకండి. వాళ్లను ప్రయత్నించనివ్వండి. ప్రేమతో ప్రోత్సహించమంటే వాళ్లు చేసే తప్పులను కూడా నవ్వుతూ చూసీచూడనట్లు వదిలేయమని కాదు. ప్రతిఫలాన్ని కాకుండా వారు పెట్టిన కృషిని అభినందించి, తప్పులను సున్నితంగా సరిదిద్దాలి. ఇంట్లోనే తప్పులను సరిదిద్ది, పరిష్కారాన్ని చూపాలి. దీనివల్ల ఓటమి ఎదురైతే కుంగిపోకుండా దాన్నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయడం, వారేం దుస్తులు ధరించాలనే విషయాలను వారినే నిర్ణయించుకోనివ్వాలి. ఇటువంటి విషయాల్లో చేసే తప్పుల నుంచి పిల్లలు సొంతంగా నిర్ణయించుకునే సామర్థ్యాన్ని ఎక్కువగా పొందుతారని సైకాలజిస్ట్‌లు తెలియజేస్తున్నారు.
క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు, ఆటల్లో గెలిచినప్పుడే కాదు.. ఓడిపోయి ఇంటికి వచ్చినా, పరీక్షల్లో ఫెయిల్ అయినా దగ్గరికి తీసుకుని ‘ఏం కాదులే.. బాగా కృషి చేశావు.. ఇంకోసారి ప్రయత్నించు’ అని దన్నుగా నిలవాలి. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అనే దాని కంటే, ఏం చేస్తున్నారు అనేదాని నుంచే పిల్లలు ఎక్కువ ప్రభావితులవుతారు, నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు తప్పు చేస్తే నిందించి, నిలదీయకుండా కూర్చోబెట్టుకుని ‘నేను కూడా తప్పులు చేశాను..’ అని దగ్గరికి తీసుకుని ఆ తప్పులు ఎందుకు చేశారో ఆ కారణాన్ని సరిచేసి దాని నుంచి నేర్చుకోమని చెప్పాలి. అద్భుతమైన విజయాలు సాధించినప్పుడు, ఖరీదైన స్కూల్స్‌లో చదివించినప్పుడు కంటే మేమున్నాం అన్న తల్లిదండ్రుల భరోసానే పిల్లలకు ఎక్కువ ఆత్మైస్థెర్యాన్ని అందిస్తుంది.