Raidurgam | హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వభూమిని ప్రయివేట్ వ్యక్తులకు చెందిన భూమిగా రికార్డులు సృష్టించి, దానిని కారుచౌకగా ఒక బిగ్‌షాట్‌కు విక్రయిస్తున్న వ్యవహారమొకటి బట్టబయలైంది. ఈ వ్యవహారంలో రాష్ర్టానికి చెందిన ఒక కీలకమంత్రి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. సదరు భూమిని నిజాం కాలం నుంచీ ప్రభుత్వభూమిగానే రెవెన్యూ రికార్డుల్లో పొందుపరుస్తుండటం గమనార్హం. దానిని 1908 సంవత్సరం కంటే ముందు నుంచి 1982 వరకు రెవెన్యూ రికార్డుల్లో ‘సర్కారు కంచె’గా పేర్కొన్నారు. 1982లో ఈ భూమికి అకస్మికంగా జీపీఏ హోల్డర్ పుట్టుకొచ్చాడు. 125 ఎకరాలు అమ్ముకున్నట్టు పత్రాలు పుట్టించాడు. భూమిని కబ్జాలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పట్లో రెవెన్యూ అధికారులు అడ్డుకొని కేసులు పెట్టారు.
ప్రభుత్వం 2010లో ఇందులో కొంతభూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. మిగిలిన భూమిని తన ఆధీనంలోనే పెట్టుకున్నది. ఇప్పుడది హైదరాబాద్‌లోనే అత్యంత విలువైన భూమి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 42 ఏండ్ల క్రితమే చెల్లవని తేల్చిన నకిలీపత్రాలను మళ్లీ వెలికితీశారు. ఒక మాజీ ఎంపీ భర్తను రంగంలోకి దింపి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయించారు. దానిని ప్రైవేటు పట్టాల ముసుగులో ఒక మల్టీనేషన్ బిగ్‌షాట్‌కు కట్టబెట్టేందుకు ఇటీవలే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో చర్చలు జరిపారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మఖ్తా గ్రామ పంచాయతీ పరిధి సర్వే నంబర్ 83లోని 99 ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు బిగ్‌షాట్‌కు విక్రయిస్తూ ఒప్పందాలు పూర్తయ్యాయి. ఈ మేరకు అడ్వాన్స్ కింద రూ.50 కోట్లు చేతులు మారాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రి సమక్షంలోనే డీల్ కుదిరిందని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
1317 ఫస్లీ (క్రీస్తు శకం 1908 ) ప్రకారం పన్మఖ్తా గ్రామ పంచాయితీ పరిధిలోని సర్వే నంబర్ పరిధిలో మొత్తం 525.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అప్పట్లో పశువుల మేతకు వదిలేసిన కంచె ఇది. 1321 ఫస్లీ (క్రీస్తుశకం 1912 ) రెవెన్యూ రికార్డుల్లో ‘సర్కారీ కంచె’గా పేర్కొని, సాగుకు పనికి రాని భూమిగా గుర్తించారు. మొహమ్మద్ జమాలుద్దీన్ అనే వ్యక్తి 1336 ఫస్లీలో రాయదుర్గ్ గ్రామంలో లావునిపై పట్టా మంజూరు కోసం దరఖాస్తు చేసుకోగా, అప్పటి అధికారులు ఆ అభ్యర్థనను తిస్కరించినట్టు రెవెన్యూ నివేదికల్లో ఉన్నది. అయితే, అతనే ఆ భూమిని సయ్యద్ అహ్మద్జ్వ్రీతోపాటు మరో 11 మంది పేర్ల మీదికి మార్చినట్టు తెలుస్తున్నది.
ఒక రిజిస్టర్డ్ సేల్‌డీడ్ డాక్యుమెంట్ నంబర్‌ను పహాణీలో పొందుపరిచి మొహమ్మద్ జమాలుద్దీన్ నుంచి సయ్యద్ అహ్మద్జ్వ్రీకి భూమిని బదలాయించినట్టు 1954-55 ఖాస్రా పహాణీ పట్టేదార్ కాలంలో రాశారు. వాస్తవానికి సయ్యద్ అహ్మద్జ్వ్రీ పేరు స్పష్టంగా ఏమీ లేదు. పేర్లు గుర్తించలేనంతగా ఖాస్రా పహాణీ చిరిగిపోయింది. అనుమానం వచ్చిన రెవెన్యూ అధికారులు పహాణీలో ఉన్న పేర్ల మీద, పొందుపరిచిన సేల్‌డీడ్ నంబర్ మీద విచారణ జరిపారు. పహాణీలో పొందుపరిచినది ఫేక్ డాక్యుమెంటుగా గుర్తించారు. అది రాయదుర్గం పన్మక్తా గ్రామానికి చెందిన డాక్యుమెంట్ కాదని, బండిగడ్డ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 103కు చెందిన 444.33 ఎకరాల భూమికి సంబంధించినదని నిర్ధారించారు. పట్టేదారు హక్కులను రద్దు చేశారు.
రుక్నుద్దీన్ అనే వ్యక్తి సర్వే నంబర్ 83లో 125 ఎకరాలను ఏ రామస్వామి అనే మరో వ్యక్తికి జీపీఏ చేసినట్టు 1976లో పత్రాలు సృష్టించారు. ఎవరీ రుక్నుద్దీన్? ఏ హక్కుల ఆధారంగా ఆయనకు జీపీఏ చేశారు? అనే ప్రశ్నలకు ఆధారాలు లేవు. జీపీఏ హోల్డర్ రామస్వామి 1982 మార్చిలో ఒక హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పేరు మీదకి భూమిని బదలాయించినట్టుగా పత్రాలు సృష్టించినట్టు రెవిన్యూ విచారణలో తేలింది. ఆ వ్యక్తి తరువాత కాలంలో అప్పటి ఆర్డీవోను వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఇతనే 2008-09 సంవత్సరాల మధ్య ఎనిమిది బోగస్ కంపెనీలను సృష్టించి, ఆరు డాక్యుమెంట్ల ద్వారా 23 ఎకరాలు ఒక కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో తేలింది. 2009లో ప్రతి కంపెనీకి 5 ఎకరాల చొప్పున ఏడు కంపెనీలకు కలిపి మరో 35 ఎకరాలు, మొత్తం కలిపి 53 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్టు జేసీ కోర్టు నిర్ధారించింది. మిగిలిన భూమిని తన బంధువుల పేర్ల మీదకి మళ్లించారు.
ఈ మొత్తం భూమికి యాజమాన్య హక్కులు కల్పించి, అమలు చేయాలని 1982లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని రెవెన్యూ అధికారులు తిరస్కరించగా… జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా దావాలు వేశారు. అన్ని న్యాయస్థానాలు కూడా అభ్యర్థనను తోసిపుచ్చాయి. కానీ, 1990లో మాత్రం మిగులు భూమిని ప్రయివేటు పట్టాగా పేర్కొంటూ 99.07 ఎకరాల భూమిని జీపీఏ హోల్డర్‌కు స్వాధీనం చేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే, మరుసటి ఏడాది అంటే 1991లో సదరు హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసినట్టు చూపిన విక్రయ ఒప్పందపత్రాలకు చట్టబద్దత లేదంటూ సేల్డీడ్లను రద్దు చేసింది.
2014లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టు 83/1, 83/2 సర్వే నంబర్లలోని 525.38 ఎకరాల భూమిని పూర్తిగా ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది. బోగస్ సంస్థలను సృష్టించి, ఫేక్ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్ధాంచింది. కోర్టుల్లో తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో ఒక సంస్థ పేరు మీదున్న 23 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు బ్యాంకుకు తనఖా పెట్టి రూ.42 కోట్లు రుణం పొందినట్టు, దీనికి అప్పటి ఆర్డీవోగా ఉన్న ఆయన భార్య ష్యూరిటీ సంతకం చేసినట్టు, ఈ డబ్బుతో తెలుగు సినిమా నిర్మించగా.. అది ఫ్లాప్ అయినట్టు తెలుస్తున్నది. దీంతో వారు బ్యాంకు లోన్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోవటంతో బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
సీబీఐ విచారణలో ఆర్డీవోనే ష్యూరిటీ సంతకాలు చేయటంతోపాటు బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చి భర్తకు సహకరించారని సీబీఐ చార్జిషీట్ వేసింది. ఈ నేపథ్యంలో 2015లో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తప్పించింది. ఈ కేసులో సీబీఐ కోర్టు వారికి ఐదేండ్ల జైలు శిక్ష కూడా విధించగా.. హైకోర్టు స్టే ఇచ్చినట్టు తెలుస్తున్నది.
రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ సర్వే నంబర్ 83/2 ఖాతా నంబర్ 99లో 33.02 ఎకరాలు రుక్నుద్దీన్, ఖాతా నంబర్ 110లో 33.02 ఎకరాలు అజీజ్ ఫాతిమా, ఖాతా నంబర్ 101లో 33.02 ఎకరాలు అబ్దుల్ అజీజ్ పేరు సూచిస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు వీరికి ఆధార్ అనుసంధానం లేదు. ఇప్పుడు ఇదే భూమి మీద ఒక కీలక మంత్రి కన్నుపడ్డది. ఇందుకు కారణం ఉన్నది. 1982 పుట్టుకొచ్చిన డాక్యుమెంట్ల చరిత్రను పరిశీలిస్తే.. రుక్నుద్దీన్ అనే వ్యక్తి ఏ రామస్వామికి జీపీఏ చేశాడు. ఏ రామస్వామి కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి భూమిని విక్రయించారు. ఆ సొసైటీ ఒక మాజీ ఎంపీ భర్త పేరు మీద ఉన్నది. పల్నాడు ప్రాంతానికి చెందిన తాజా ఎమ్మెల్యే ఒకరు, కోనసీమ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఈ భూముల మీద పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. వీళ్లంత కీలక మంత్రితో సన్నిహిత సంబంధాలున్న వాళ్లే కావడం గమనార్హం. ఎట్లాగైనా ఆ భూమిని తమ పేరు మీద పట్టా చేయాలని కోరడంతో సదరు మంత్రి, ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లి డీల్ ఓకే చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ఈ మేరకు సర్వే నంబర్ 83/2లోని ఖాతా నంబర్లు 99, 100, 101 మీద ఉన్న భూమిని మాజీ ఎంపీ భర్త పేరు మీదకు మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేయించారు. ఈ నేపథ్యంలో 2023 ఆగస్టులో రాష్ట్ర హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా ఆ హౌసింగ్ సొసైటీకి భూమి క్రయవిక్రయ సేల్డీడ్లు బోగస్ అని తేల్చింది. అవి బోగస్‌పత్రాలు కావని నిరూపించుకోవడంలో సొసైటీ విఫలం అయిందని తీర్పు చెప్పింది. దీంతో అది ప్రభుత్వభూమేనని నిర్దారణ అయింది. అయినా, ఇటీవల అడ్వకేట్ జనరల్ ఒకరు దానిని ప్రైవేటు పట్టాగా నిర్దారిస్తూ దరఖాస్తుదారునికి మద్దతుగా అఫిడవిట్ ఇచ్చారు. ఇదే ఏడాది జూన్‌లో టీఎస్ఐఐసీ 99.06 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం ఇచ్చింది. ఈ రెండు పత్రాలను జత చేస్తూ మాజీ ఎంపీ భర్త మ్యుటేషన్ చేసి పట్టాలు ఇవ్వాలంటూ రెవిన్యూ అధికారులను అభ్యర్థించారు.
ఈ భూమినే ఒక బిగ్‌షాట్‌కు కట్టబెట్టేందుకు అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్లో చర్చలు జరిపినట్టు తెలిసింది. మాజీ ఎంపీ దంపతులు, ఏపీకి చెందిన తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతో కలిసి చర్చలు జరిగినట్టుగా తెలుస్తున్నది. రాష్ట్ర కీలక మంత్రి ఒకరు ఇద్దరి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్టు సమాచారం. కేవలం 5 ఎకరాల భూమి ధరకే మొత్తం 99.06 ఎకరాలు విక్రయంచేటట్టు ఒప్పందం జరిగిందని సమాచారం. రూ. 50 కోట్లు అడ్వాన్స్ కింద వారికి అప్పగించినట్టుగా తెలిసింది. కాగా దీనిపై సదరు మంత్రి వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
1976 లాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తరువాత ఇందులోంచి 424.13 ఎకరాల భూమిని అర్బన్ లాండ్ సీలింగ్ యాక్టు కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అది పోనూ ఇంకా 99.07 ఎకరాలను మిగులు భూమి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అదే ఏడాది (1976) గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ 23న 99.07 ఎకరాలు స్వాధీనం చేసుకున్నది. 1987 నవంబర్‌లో ఇదే భూమిని రెండుగా విభజన చేస్తూ భూ సంస్కరణ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం 424.13 ఎకరాల భూమిని సర్వే నంబర్ 83/1 గాను, మిగిలిన 99.07 ఎకరాల భూమిని సర్వే నంబర్ 83/2గా విభజన చేస్తూ రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. మొత్తం భూమిని రెవిన్యూ డివిజనల్ అధికారికి(ఆర్డీవో) అప్పగించారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నంబర్ 83/1 కింద ఉన్న 424.13 ఎకరాల భూమిని జీవో నంబర్ 161 ద్వారా ఏపీఐఐసీకి కేటాయించింది. 2010 మేలో ఆ భూములను ఏపీఐఐసీకి అప్పగించింది. సర్వే నంబర్ 83/2 కింద ఉన్న 99.07 ఎకరాల భూమి ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నది.