Krishna Projects | కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం 79,269 క్యూసెక్కుల వరద సాగర్ వైపు వెళ్తున్నది. జురాల, సుంకేశుల నుంచి ప్రాజెక్టుకు 1,18,410 క్యూసెక్కుల వరద వస్తుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.4 అడుగుల మేర నీరు ఉంది. పూరిస్థాయినీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 195.6 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం, కుడి, ఎడమ గట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. రెండు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 65,807 క్యూసెక్కుల వరద కిందకు వెళ్తోంది. ఇదిలా ఉండగా.. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు సైతం వరద వచ్చి చేరుతున్నది. దాంతో అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో 1,71,683 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 2,12,753 క్యూసెక్కులుగా ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 587 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 305.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది.