హైదరాబాద్, నవంబర్11(నమస్తే తెలంగాణ): చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంచనా వేసినట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ సుస్పష్టం అయింది. అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా సగటు ఓటరు రెండేండ్ల పాలనను, పదేండ్ల అభివృద్ధిని బేరీజు వేసుకొని సైలెంట్ ఓటు వేసినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ సర్వే మీదికి మళ్లింది. ఎన్నికలు ముగిసిన పది నిమిషాలకే పోల్ సర్వే సంస్థలు ఎవరికి వారు ఫలితాలను బయటపెట్టారు.
కొన్ని జాతీయ సంస్థలు బీఆర్ఎస్ అభ్యర్థి వైపే ఓటర్లు మొగ్గారని తేల్చి చెప్పగా, ఇంకొన్ని సంస్థలు కాంగ్రెస్‌దే పై చేయి అని ప్రకటించాయి. బెట్టింగ్‌లు, ప్రలోభాలు ఇలా అనేక అంశాలు ఈ ఎన్నికపై ప్రభావం చూపాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రతిసారి ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అవి విఫలమైన సందర్భాలే ఎక్కువ. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమికి 320 నుంచి 340 వరకు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా 240 సీట్ల వద్దే ఆగిపోయింది. మరో వైపు అధికారం బరితెగించిన చోట, రౌడీల గుత్తాధిపత్యంలో రాజ్యం ఉన్నచోట ప్రజానాడిని పట్టుకోవడం ఎవరితరం కాదు. పోలింగ్ బూత్ వరకు ధైర్యంగా రాలేని సగటు ఓటరు తన ఓటు ఎటువైపు వేశాడో గుట్టు విప్పి చెప్పటం దాదాపు అసాధ్యం.
ఆ ఓటు ఎటు పడ్డట్టు?
అయితే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఒక వైపు ఉంటే కాంగ్రెస్, ఎంఐఎం మరోవైపు పోటీ పడింది. ఇంకోవైపు బీజేపీ కూడా పోటీలో ఉన్నది. ఇప్పటి వరకు అందిన అధికారిక సమాచారం మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.24 శాతం పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతానికి కొద్దిగా అటూఇటు తేడా ఉన్నట్టు చెప్పాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఓటు శాతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంప్రదాయ ఓటింగ్ శాతం అసలు తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్పంగా పెరిగినట్టు కనిపిస్తున్నది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 14 శాతం ఓటింగ్ వచ్చింది. ఉప ఎన్నికల్లో మా త్రం అన్ని ఎగ్జిట్ పోల్స్‌కు 14 శాతం నుంచి 6 శా తానికి తగ్గినట్లు చెప్పాయి. సుమారుగా 8 శాతం ఓట్లు క్రాస్ అయ్యాయి. అంటే సగానిపైగా ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయి. ఈ ఓటు ఎటు పడింది అనేది ప్రశ్న. ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మళ్లిందా? బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరింత చీల్చుకున్నాయా? అన్నదే ఎన్నికల ఫలితాలను తేల్చుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
బీఆర్ఎస్ వైపు సైలెంట్ ఓటరు
గత అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం పోలింగ్ నమోదైతే ఇప్పుడు అది 48.24 శాతానికి పెరిగినట్టు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. అంటే స్వల్ప ఓటింగ్ పెరిగింది. ఒకశాతం లేదంటే గరిష్ఠంగా రెండుశాతం పెరిగింది. పెరిగిన ఈ ఓటింగ్ కూడా గెలుపును డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌గా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ ఓట్ షేర్ ఏకపక్షంగా కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం లేదు. అలా అని బీఆర్ఎస్కు కూడ సంపూర్ణంగా పడే చాన్స్ లేదు. ఆ 8 శాతం ఓట్ షేర్ కచ్చితంగా రెండు పార్టీల మధ్య చీలిపోతుంది. అధికార, విపక్షాల మధ్య ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది కూడా 5 శాతం తేడానే. కాబట్టి బీజేపీ కోల్పోయిన ఓట్ షేర్ ఏ పార్టీ ఎకువ సాధిస్తే ఆ పార్టీకే జూబ్లీహిల్స్‌లో గెలుపు అవకాశాలు ఎకువగా ఉంటాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం మైనార్టీల మద్దతు చాలా స్వల్పం. అప్పటితో ఎన్నికలతో పోలిస్తే మైనార్టీ వర్గాలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. ప్రభుత్వ వ్యతిరేకత వందకు వందశాతం ప్రజల్లో ఉన్నది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ వైపు సైలెంట్ ఓట్లు పడ్డట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.