నిర్మల్: భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. వరద ఉగ్రరూపం దాల్చడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తున్నది. దీంతో 1995 తర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటి సారని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి 2 లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్ రూమ్‌లోకి వరద నీరు చేరింది.
కాగా, భారీగా వరత వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొత్తం 18 గేట్లలో ఒక మొరాయించింది. దీంతో 17 గేట్ల ద్వారా వరదను కిందికి విడుదల చేస్తున్నారు. పెద్దఎత్తున నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ఉధృతిపై మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆరా తీశారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీలో వరద బీభత్సం సృష్టిస్తున్నది. వరద ఉధృతికి శంభు మత్తడి గూడ ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దీంతో వరద దిగువ ప్రాంతాల్లోకి చేరుతోంది. ఈ క్రమంలో దిగువన ఉన్న లక్కారం, గంగన్నపేటలకు వరద ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జిల్లాలోని ఇచ్చోడలో 32.90 సెంటీమీటర్లు, నేరడిగొండలో 29.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.