హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : నల్సార్ సహా దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఫీజలను చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థుల నుంచి మూడురకాల ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)ను నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ క్యాటగిరీ విద్యార్థుల నుంచి రూ.4 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ వంటి రిజర్వ్డ్ క్యాటగిరీ విద్యార్థుల నుంచి రూ.3,500 తీసుకుంటున్నారు.
అదే జేఈఈలో జనరల్ క్యాటగిరీకి రూ.1,000, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి రూ.900, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 మాత్రమే ఫీజుగా తీసుకుంటున్నారు. క్లాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఫీజుగా రూ.50 వేల చొప్పున చెల్లించుకోవాల్సిందే. కౌన్సెలింగ్లో పాల్గొన్న జనరల్ క్యాటగిరీ విద్యార్థులు రూ.30 వేలు, రిజర్వుడ్ క్యాటగిరీ విద్యార్థులు రూ.20 వేలు ఫీజుగా చెల్లించాలి. ఆ తర్వాత రూ.20 వేలు నాన్ రిఫండబుల్ ఫీజుగా చెల్లించాలి. సీటు వదులుకున్నా ఆ రూ.20 వేలను తిరిగి ఇవ్వరు. దీంతో పెరిగిన ఫీజులను తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.