Engineering Colleges | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మారిన పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు డిమాండ్ పెరిగింది. అత్యధిక మంది విద్యార్థులు అదే గ్రూప్ తీసుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు బీ-క్యాటగిరీ ఫీజులను ఏటికేడు పెంచేస్తున్నాయి. టాప్ కాలేజీల్లో అదే సీఎస్ఈ గ్రూప్ బీ-క్యాటగిరీ సీటుకు రూ.18 లక్షలు పలుకుతున్నది. నిరుడు ఇదే కాలేజీల్లో రూ.14 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు.
ఈ సారి మరింతగా డిమాండ్ పెరగడంతో అడిగినంత ఫీజులు కడతామన్నా కొన్ని టాప్ కాలేజీల్లో సీట్లే దొరకడం లేదు. దీంతో తల్లిదండ్రులకు టెన్షన్ పట్టుకున్నది. ఇంత జరుగుతున్నా సర్కారు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈ వక్రమార్గాలను నియంత్రించడమే లేదు. దీంతో కాలేజీలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతున్నది. బీ-క్యాటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కన్వీనర్ కోటా ఫీజులకు మూడు రెట్లు పెంచేలా ఓ నివేదికను రూపొందించి, సర్కారుకు సమర్పించింది. దీనిపై సర్కారు ఏదీ తేల్చలేదు. దీంతో ఈ సీట్ల దందా రెట్టింపైంది.
రాష్ట్రంలో ఎప్‌సెట్ ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇంకా నోటిఫికేషనే విడుదల కాలేదు. కానీ యాజమాన్య కోటా సీట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. బీటెక్‌లో 30 శాతం సీట్లను బీ-క్యాటగిరీ కింద భర్తీ చేసుకునే అవకాశం ఉన్నది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ తర్వాత ఉన్నత విద్యామండలి బీ-క్యాటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.
నిబంధనల ప్రకారం కాలేజీలు మూడు భాషల దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీచేయాలి. ఆయా నోటిఫికేషన్లో బ్రాంచీల వారీగా మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్లను ప్రకటించాలి. దరఖాస్తు విధానం, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, దరఖాస్తుకు చివరి గడువు వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. యాజమాన్యాలు ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తులన్నింటినీ స్వీకరించాలి. దరఖాస్తుదారులకు ధ్రువీకరణ (ఎక్నాలెడ్జ్) పత్రం కూడా అందించాలి. కోర్సుల వారీగా దరఖాస్తు చేసిన మొత్తం విద్యార్థుల జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతోపాటు, నోటీస్ బోర్డులోనూ పొందుపరచాలి. ప్రతి కోర్సుకు ఎన్నారై, జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకు, ఇంటర్ మార్కుల పర్సంటేజీ ఆధారంగా ప్రత్యేకంగా మెరిట్ జాబితాలను సిద్ధంచేసి, వెబ్సైట్లో, నోటీసు బోర్డులో పొందుపరచాలి. మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీచేయాలి.
బీటెక్ ‘బీ’ క్యాటగిరీ సీట్ల భర్తీలో రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఏ కాలేజీ నిబంధనలు పాటించడంలేదన్నది బహిరంగ రహస్యం. అయినా విద్యాశాఖ నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నది. గతంలో సీట్ల భర్తీలో కాలేజీలు భారీగా ఉల్లంఘనలకు పాల్పడ్డట్టుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఇష్టారీతిన సీట్లను భర్తీచేసిన 30 కాలేజీలకు మండలి నోటీసులు సైతం ఇచ్చింది. ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చి వివరణ కోరింది. కొన్ని కాలేజీలైతే ఈ నోటీసులకు స్పందించనేలేదు. దీంతో సంబంధిత కాలేజీల సీట్ల ర్యాటిఫికేషన్ (ఆమోదాన్ని) పెండింగ్‌లో పెట్టింది. ఆ తర్వాత యథావిధిగా ఆమోదించింది. కాలేజీలు ఉల్లంఘించడం, అధికారులు నోటీసులివ్వడం ఆ తర్వాత వదిలేయడమనే తంతు ఏటా పునరావృతమవుతూనే ఉన్నది.