హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో స్ప్రే డ్రయ్యర్ పేలడం వల్లనే మరణాల సంఖ్య భారీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించాయని, అయితే ఇక్కడ మాత్రమే ప్రాణనష్టం ఎక్కువగా ఉండటానికి కారణం డ్రయ్యర్ సైజు ఎక్కువ కావడమేనని అంటున్నారు. పెద్ద సైజులో డ్రయ్యర్ ఉండటం, దాని పక్కనే క్వాలిటీ కంట్రోల్ రూం, ఆ పక్కనే ప్యాకింగ్ విభాగాలు ఉన్నాయని, ఆ రెండు విభాగాల్లోనే ఎక్కువమంది సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైందని చెప్తున్నారు. షిఫ్ట్ టైమింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అప్పటికే పనిచేసిన వారు డ్యూటీ దిగుతారు. ఈ చేంజ్ ఓవర్ సమయంలోనే పేలుడు సంభవించడం వల్లనే ఎక్కువమంది చనిపోయారని అంటున్నారు.
సిగాచి కంపెనీలో ట్యాబ్లెట్ల తయారీలో వాడే మైక్రో క్రిస్టెలిన్ సెల్యులోజ్ (ఎంసీసీ)ను తయారు చేసేందుకు సుమారు 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రయ్యర్ ఉపయోగిస్తున్నారు. బల్క్‌గా ప్రొడక్షన్ జరగాలని కొన్నేండ్లుగా వాడుతున్నారు. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్ల వాడకం పెరగడంతో వీటికి డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్పత్తిని కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. 1985 నుంచి సిగాచి కంపెనీ ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నది. ఈ కంపెనీలో మొదట క్లోరినేటర్ పారబిన్, మైక్రో క్రిస్టెలిన్ సెల్యులోజ్ (ఎంసీసీ)తో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే, 1995లో క్లోరినేటర్ పారబిన్ ఉత్పత్తి ఆపేశారు. అప్పట్నుంచి ఎంసీసీనే ఉత్పత్తి చేస్తున్నారు.
ట్యాబ్లెట్లను గోలీ రూపంగా తయారు చేయడానికి ఎంసీసీని ఉపయోగిస్తారు. ఒక ట్యాబ్లెట్లో మందుశాతం తక్కువగా ఉంటే ఈ ఎంసీసీ శాతం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే ట్యాబెట్ బయటికి వస్తుంది. అన్ని ఫార్మా కంపెనీలకు దీనిని ముడి పదార్థంగా పంపిస్తారు. ఏ కంపెనీ ట్యాబెట్స్ తయారు చేయాలన్నా ఎంసీసీని వాడాల్సిందే. దీని కోసం స్ప్రింగ్ ఫ్లాష్ డ్రయ్యింగ్, ఎఫ్‌బీడీ డ్రయ్యింగ్, స్ప్రే డ్రయ్యింగ్ చేస్తారు. ఇక్కడ 80శాతం డ్రయ్యింగ్ అంతా స్ప్రే డ్రయ్యింగ్లోనే జరుగుతుంది. ఆ డ్రయ్యర్ పరిమాణం సుమారు 40 వేల లీటర్లు ఉంటుంది. ఇది ఇంత భారీ పరిమాణంలో ఉండటం వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు.
ఈ పెద్ద డ్రయ్యర్ గంటకు సుమారు 150 కేజీలు, రోజుకు సుమారు 2 వేల కేజీల ఎంసీసీ ఉత్పత్తి చేస్తుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. అయితే 420 డిగ్రీల వరకు అది వేడిని తట్టుకోగలుగుతుందని, ఆ తర్వాత పుట్టే వేడికి ఇది పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రయ్యర్‌ను క్లీన్ చేయకపోవడం, అప్పటికే భారీగా ఎంసీపీ పేరుకుపోవడం, పైనుంచి సుమారు 220 డిగ్రీల్లో వేడిగాలులు రావడంతో ముడిపదార్థంగా ఉన్న ఎంసీసీ మరింత వేడెక్కి డ్రయ్యర్ పేలిపోయిందని, దానిపక్కనే ఉన్న మూడు హీట్ బాయిలర్స్ సైతం ఆ ధాటికి బాంబుల్లా పేలిపోయాయని వివరిస్తున్నారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. అందుకే స్ప్రే డ్రయ్యర్లను కనీసం 15 రోజులకు ఒకసారి కచ్చితంగా క్లీన్ చేసుకోవాలని అంటున్నారు.