భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు (Saraswathi Pushkaralu) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారంతో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించి, దైవదర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు వన్ వే ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ అయింది.
బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు సరిపోకపోవడంతో భక్తులు కాలినడకన వెళ్లి స్నానాలు ఆచరించారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆదివారం సరస్వతీ పుష్కరాలకు హాజరుకానున్నారు.