కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగుతున్నది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మాల విరమణ చేసి, తలనీలాలు సర్పించి అంజన్నను దర్శించుకుంటున్నారు.
కాగా, బుధవారం రాత్రి 8 గంటల నుంచే భక్తుల రాక పెరగడంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున కొండగట్టులో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షించారు. క్యూలైన్లను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.