హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పునర్నిర్మాణం తర్వాత యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వారాంతాల్లో నారసింహ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతున్నది. అలాగే, అత్యధికంగా భక్తులు దర్శించుకొన్న పుణ్యక్షేత్రాల్లో ఏపీలోని తిరుమల దేవస్థానం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించింది. ఈ జాబితాలో వారణాసి మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకుముందు తిరుమల తొలిస్థానంలో ఉండేది.
‘కాశీ-విశ్వనాథ్ కారిడార్ ’ ప్రారంభం తర్వాత వారణాసికి సందర్శకుల సంఖ్య పెరిగినట్టు తేలింది. దీనికితోడు ఐఆర్సీటీసీ, ఇతర సంస్థలు ట్రావెల్ ప్యాకేజీలు అందిస్తున్నట్టు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, కరోనా ఆంక్షలను సడలించడమే ఇందుకు కారణమని పేర్కొన్నది. పర్యాటకుల గదుల బుకింగ్ అంశంలో తిరుమల తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏకంగా 233 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గదుల బుకింగ్ విభాగంలో తిరుపతి తర్వాత వారణాసి, షిర్డీ ఉన్నాయి.